EX MLA Pinnelli Ramakrishna Reddy Police Custody : పరామర్శ పేరుతో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారంపూడిలో భారీగా అల్లర్లకు పాల్పడటమే కాకుండా విధుల్లో ఉన్న సీఐ నారాయణస్వామిపై రాయితో దాడి చేశారు. దీనిపై నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ అధికారి డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెండో రోజు విచారణ చేశారు.
మరోసారి కస్టడీ : ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మధ్యలో ఒక గంట భోజన విరామం ఇచ్చారు. ప్రధానంగా కారంపూడిలో జరిగిన దాడిపై పోలీసులు మొత్తం 65 ప్రశ్నలు అడగ్గా ప్రతి ప్రశ్నకు పిన్నెల్లి పొంతనలేని సమాధానాలు చెప్పినట్టు సమాచారం.
పోలింగ్ తర్వాత రోజు మాచర్లలోని ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేదని ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారని ఆ రోజంతా పూర్తిగా గృహ నిర్బంధంలో ఉన్నానని 'అలాంటిది కారంపూడి ఎలా వెళ్తాను? సీఐపై దాడి ఎలా చేస్తాను?' కారంపూడిలో జరిగిన ఘటనకు నాకు ఎలాంటి సంబంధం లేదని పిన్నెల్లి పదేపదే చెప్పినట్లు తెలిసింది. రామకృష్ణారెడ్డి పోలీసుల విచారణకు సక్రమంగా సహకరించకపోవడంతో మరోసారి కస్టడీకి కోరుతూ కోర్టుకు నివేదించనున్నట్లు పోలీసులు తెలిపారు.
కోర్టు ఆదేశాల ప్రకారమే విచారణ : సోమవారం నాడు తొలి రోజు విచారణకు సంబంధించి నెల్లూరు కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావు ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చారు. గురజాల కోర్టు ఆదేశాల ప్రకారం సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిమాండ్ ఖైదీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని విచారణ చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. థర్డ్ డిగ్రీ వాడొద్దని, కస్టడీ సమయంలో ఖైదీకి ఎలాంటి అసౌకర్యం కలిగించవద్దని అలాగే విచారణ మొత్తం వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయమని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
విచారణ అధికారి, తనతో పాటు ఇన్స్పెక్టర్, మరికొంత మంది సిబ్బందిని జైలులోకి అనుమతించాలని కోరారని దీనికి ఖైదీ తరఫున కౌన్సిల్ అభ్యంతరం తెలపడంతో ఆ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కోర్టు నుంచి సవరణ ఉత్తర్వులు వచ్చిన తర్వాత సాయంత్రం 3గంటల35 నిమిషాలకు ఏడుగురు సిబ్బందిని కారాగారం లోపలికి అనుమతించామని తెలిపారు. ఇదంతా కోర్టు ఆదేశాల ప్రకారమే చేశామని తెలిపారు.
పిన్నెల్లి బెయిల్ పిటిషన్ రద్దు చేయండి : గుంటూరు కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ కోరుతూ అతని తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా దాన్ని రద్దు చేయాలని ఇవాళ పోలీసుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.
పిన్నెల్లిని అన్యాయంగా అరెస్టు చేశారు - జగన్ ఆవేదన - jagan met pinnelli ramakrishna