EVM VOTES COUNTING : కౌంటింగ్ సమయంలో ఈవీఎం కంట్రోల్ యూనిట్లను మాత్రమే కౌంటింగ్ టేబుల్ వద్దకు తీసుకువస్తారు. "బ్యాలెట్ యూనిట్లు" స్ట్రాంగ్ రూంలోనే ఉంటాయి. "కంట్రోల్ యూనిట్"తో పాటుగా నమోదైన ఓట్ల కౌంట్ తెలిపే సంబంధిత ఫారం 17C కాపీని కూడా కౌంటింగ్ టేబుల్ వద్ద అందజేస్తారు.
ఓట్ల లెక్క ప్రారంభానికి ముందు ఈవీఎం "కంట్రోల్ యూనిట్" సీల్స్ తనిఖీ చేస్తారు. పేపర్ స్ట్రిప్ సీల్, స్పెషల్ ట్యాగ్, గ్రీన్ పేపర్ సీల్ తదితర క్యారీయింగ్ కేస్ కు ఉన్న ముఖ్యమైన సీల్స్ అన్నింటినీ, మరీ ముఖ్యంగా కంట్రోల్ యూనిట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ను ఏజెంట్లు చెక్ చేసుకుని, అన్ని సరిగా ఉన్నట్లు సంతృప్తి వ్యక్తపరచిన తరువాత మాత్రమే ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. ఏదైనా తేడాలు ఉంటే ఆయా కంట్రోల్ యూనిట్ల లెక్కింపు ఆపి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి వారు నిర్దేశించిన విధంగా స్పందిస్తారు.
కౌంటింగ్ ప్రక్రియ సరిగా కనిపించకపోతే టేబుల్ ఇంఛార్జికి తెలిపి తగిన మార్పులు చేయించుకోవాలి. సాధారణంగా ప్రత్యర్థి ఏజెంట్లు దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తారు. జాగ్రత్తగా మసలుకోవాలి.
టేబుల్ ఇంఛార్జ్ కంట్రోల్ యూనిట్ రిజల్ట్ బటన్ నొక్కిన తరువాత, మొత్తం పోలయిన ఓట్ల సంఖ్య వస్తుంది. దానిని ఫారం 17C తో సరిపోయిందా లేదా చూసుకోవాలి. తేడా ఉంటే రిటర్నింగ్ అధికారికి రిపోర్ట్ చేయాలి.
ముందుగా తీసుకువెల్లిన ఫారంలో ఒక్కొక్క అభ్యర్థికి పోలైన ఓట్ల సంఖ్యను కంగారు పడకుండా రాసుకోవాలి. ఇండిపెండెట్లే కదా అని వదిలేయకుండా అందరి అభ్యర్థులకు పోలయిన ఓట్ల సంఖ్య కంట్రోల్ యూనిట్ చూసి, రాసుకోవాలి. ఆలస్యం అవుతుంది అని తొందర చేసి టేబుల్ ఇంఛార్జి చదువుతారు. మీకు ఇబ్బందిగా ఉంటే స్క్రీన్ చూపమనండి, మెల్లగా చదవమనండి. పట్టించుకోకపోతే రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలి తప్ప ఎక్కడా ఒత్తిడికి లోనుకావద్దు.
ఒక్కొక్క సారి టేబుల్ ఇంఛార్జ్ చదివేటప్పుడు తెలిసీ, తెలియక కొన్ని తప్పులు జరగడం సహజం. ఉదాహరణకు 316 ని 361 గా ఇంగ్లిష్ లో పలుకవచ్చు. జాగ్రత్తగా గమనించి, వారిని హెచ్చరించండి. కావాలని చేసేవారు వాటిని ఇండిపెండెంట్ అభ్యర్థుల లెక్కలో తగ్గించి కూడిక సరిపోయేటట్టు చేసుకొంటారు. అందుకే ఇండిపెండెట్స్ ఓట్లు కూడా జాగ్రత్తగా రాసుకోవాలి.
కౌంటింగ్ విధానంపై కంప్లైంట్ ఉన్నా, కూడిక తేడా వస్తున్నా, మరలా చూపించమని అడగవచ్చు. వారు పట్టించుకోకపోతే అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లి, రాతపూర్వకంగా తెలుపవచ్చు.
ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తరువాత, అబ్జర్వర్ ర్యాండంగా ఏవైనా రెండు కంట్రోల్ యూనిట్లను ఎంచుకొని, మైక్రో-అబ్జర్వర్ ద్వారా ఆ కంట్రోల్ యూనిట్ల రిజల్ట్ని నోట్ చేయించి, సంబంధిత టేబుల్ ఇంఛార్జ్ వద్ద ఉన్న రిజల్ట్ వివరాలతో చెక్ చేసి, సరిపోయాయో లేదో చూసుకుంటుంటారు.
అన్ని పోలింగ్ బూత్ల లెక్కింపు పూర్తి అయి, అన్ని కౌంటింగ్ షీట్ (ఫారం-17C, పార్ట్- II)లో ఓట్ల వివరాలు పరిశీలిస్తారు. అభ్యర్థి గాని, ఎన్నికల ఏజెంట్ గాని, కౌంటింగ్ ఏజెంట్ గాని సంతకం చేసిన తరువాత రిటర్నింగ్ అధికారి అన్ని వివరాలను పరిశీలించి ఎలాంటి అభ్యంతరాలు లేవని నిర్ధారించుకున్న తర్వాత ఫారం-20 నమోదు చేసి తుది ఫలితం వెల్లడిస్తారు.
కౌంటింగ్ ఏజెంట్లకు ముఖ్య సూచనలు
1) బ్రేక్ ఇచ్చినప్పుడు తప్పితే కౌంటింగ్ టేబుల్ వీడరాదు. మరీ ముఖ్యంగా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు పూర్తి ఏకాగ్రతతో ఉండాలి.
2) ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలను అందుకు సంబంధించిన పత్రాలపై టేబుల్ ఇంఛార్జ్ సక్రమంగా నమోదు చేసి సంతకం చేసిందీ లేనిదీ జాగ్రత్తగా గమనించాలి.
3) ఎవరైనా టేబుల్ ఇంఛార్జ్ సక్రమంగా కౌంటింగ్ చేయడం లేదని గాని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని గాని మీరు గుర్తిస్తే వెంటనే రిటర్నింగ్ అధికారిని సంప్రదించాలి. టేబుల్ ఇంఛార్జ్ ఏ తప్పులు చేస్తున్నాడో రాతపూర్వకంగా తెలియజేసి అక్నలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఆ ఓట్లను తిరిగి కౌంటింగ్ చేయమని అడగాలి. ఆ రాతపూర్వక పత్రం నకలును కూడా మీ వద్ద ఉంచుకోవాలి.
4) ప్రత్యర్థి కన్నా తక్కువ ఓట్ల వ్యత్యాసం ఉన్నప్పుడు తప్పకుండా రీకౌంటింగ్ కోరే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు అభ్యర్థి దృష్టిలో అన్ని వివరాలు ఉంచాలి. RO/ARO/మైక్రో అబ్జర్వర్ కి రీకౌంటింగ్ ఆవశ్యకత వివరించడం చాలా ముఖ్యం. ఒక్కసారి ఫలితం ప్రకటిస్తే, దానిని కోర్టులో మాత్రమే ఛాలెంజ్ చేయగలం.
5) ప్రతి రౌండ్లోనూ జాగ్రత్తగా ఉండాలి, అవసరమైన చోట, అవసరమైన విషయాలపై రాతపూర్వకంగా తెలియపర్చాలి. లాజిక్ ప్రకారం, వినయంగా న్యాయం చేయమని అడగాలి.
6)2 కొత్త బాల్ పెన్లు, రైటింగ్ పాడ్, A4 సైజు తెల్ల కాగితాలు, calculator, టేబుల్ కౌంటింగ్ ఫారాలు తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
ఫారం-17A అంటే పోలింగ్ సమయంలో ఓటర్ల నమోదు రిజిష్టర్, ఓటరుకు ఓటు ఇచ్చు సమయంలో, ఓటరు వివరాలను నమోదు చేసుకుని ఓటరుచే సంతకం లేదా వేలిముద్ర వేయించిన రిజిస్టర్.
ఫారం-178 అనగా టెండరు ఓటు రిజిస్టర్
ఫారం-17C, పార్ట్-1 అనగా ఓటర్ల సమగ్ర నమోదు వివరాలు పొందుపరిచి ఉంటుంది.
ఫారం-17C, పార్ట్-II అనగా పోలింగ్ బూత్ కౌంటింగ్ పూర్తయిన తరువాత, బూత్ ఫలితాల వివరాలను ఫారం-17C, పార్ట్-IIలో నందు నమోదు చేస్తారు.
RO/ARO టేబుల్ కౌంటింగ్
1) పోస్టల్ ఓట్లని సంబంధిత ఫారంలో నింపి అభ్యర్థి, అబ్జర్వర్ కూడా చూసి సంతకం చేసిన తరువాత ఆ రౌండ్ ఫలితం డిక్లేర్ చేస్తారు.
2) 5 ఈవీఎంలు లాటరీ పద్ధతిలో తీసుకొని వాటి VVPAT ఓటింగ్ స్లిప్పులు 100 శాతం కౌంట్ చేసి, ఒక్కొక్క అభ్యర్థికి వచ్చిన ఓట్లు రికార్డు చేయాలి. వీటిని, సంబంధిత ఈవీఎం కంట్రోల్ యూనిట్స్ కౌంటింగ్లో వచ్చిన ఓట్లతో సరిచూసుకొని అంతా సవ్యంగానే ఉంది అనుకుంటేనే తుది ఫలితం డిక్లేర్ చేయాలి.
పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు ఎలా? - తిరస్కరణకు అవకాశాలెన్నో! - Postal Ballot
కౌంటింగ్ ఏజెంట్ అర్హతలు ఏంటో తెలుసా?- అక్కడ వాళ్లదే 'కీ' రోల్ - Counting agents