EC CLARIFICATION TO AP HIGH COURT ON JANASENA GLASS SYMBOL : స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం నేటికి విచారణ వాయిదా వేసింది. నేటి విచారణలో స్వతంత్రులకు గ్లాసు గుర్తు కేటాయించే విషయంపై జనసేనకు ఈసీ క్లారీటీ ఇచ్చింది.
కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో జనసేన పోటీ చేస్తుందని, తుని నియోజకవర్గంలో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారని కోర్టు దృష్టికి న్యాయవాది తీసుకెళ్లారు. జనసేన పోటీ చేస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతరులకు, స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించమని కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు నివేదిక ఇచ్చారు. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల్లోని పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇతరులకు గ్లాసు గుర్తు కేటాయించమని, ఆయా లోక్‌సభ పరిధిలోని 7 స్థానాల్లో ఎక్కడా స్వతంత్రులకు గాజు గ్లాసు ఉండదని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నిర్ణయంతో జనసేనకు ఇబ్బందులు తొలుగుతాయని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈసీ న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వ్యాజ్యంపై విచారణను మూసివేసింది.
Arguments In The High Court On Tuesday : గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని జనసేన పార్టీ తరపు సీనియర్ న్యాయవాది వాదనలు వినిపించారు. రెండోసారి కూడా ఎన్నికల అధికారికి వినతిపత్రం ఇచ్చినా ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా 2 ఎంపీ, 21 ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మిగతా సీట్లలో తమతో పొత్తులో ఉన్న టీడీపీ, బీజేపీ పోటీ చేస్తున్నాయని, ఆ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని కోరామన్నారు. గాజు గ్లాసు గుర్తును స్వతంత్య్ర అభ్యర్థికి కేటాయించటం వల్ల కూటమికి నష్టం వస్తుందన్నారు. జనసేన ఇచ్చిన అభ్యర్ధనపై 24 గంటల్లో ఈసీ నిర్ణయం ఉంటుందని ఎన్నికల సంఘం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
JANASENA GLASS SYMBOL TO INDEPENDENTS : కాగా జనసేన పోటీలో లేని పలు అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో స్వతంత్ర అభ్యర్థులకు ఎలక్షన్ కమిషన్ గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. టీడీపీ, బీజేపీతో పొత్తుల్లో భాగంగా జనసేన 21 శాసనసభ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన పార్టీ బరిలో లేని నియోజకవర్గాల్లో గాజు గ్లాసు గుర్తును ఎలక్షన్ కమిషన్ ఫ్రీ సింబల్స్ జాబితాలో పెట్టి, స్వతంత్ర అభ్యర్థులకు ఈ గుర్తును కేటాయించింది.
ఆంధ్రప్రదేశ్లో ధర్మానిదే విజయం - పొత్తుదే గెలుపు - కూటమిదే పీఠం : పవన్ కల్యాణ్
ఎన్డీఏ కూటమి ఓటర్లలో గందరగోళం సృష్టించి, ఓట్లు చీల్చేందుకు వైసీపీయే ఈ కుట్రకు తెర లేపిందని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నచోట్ల, వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నచోట్ల స్వతంత్రులుగా బరిలో ఉన్న ఆయా పార్టీల రెబల్ అభ్యర్థులకు, ఇతర స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా 50కు పైగా శాసనసభ, లోక్‌సభ స్థానాల్లో స్వతంత్రులకు, పలు చిన్న పార్టీల అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.
వేరే పార్టీకి గాజు గ్లాస్ గుర్తు: సీఈసీకి భాజపా-జనసేన ఫిర్యాదు