EC Action Against Collectors and SPs: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా తీరుమారని కొందరు వైసీపీ అనుకూల ఉన్నతాధికారులపై చర్యలకు రంగం సిద్ధమౌతోంది. జిల్లా ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్న ఏడుగులు కలెక్టర్లు, 14 మంది ఎస్పీలు, సీపీలపైనా ఎన్నికల సంఘం వేటు వేసే అవకాశాలున్నాయి. గతం నుంచే ఈసీ(EC) ఆయా అధికారుల వ్యవహారశైలిపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల సమరం షురూ - తొలి దశ నోటిఫికేషన్ విడుదల
ఆ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకున్న కేంద్ర ఎన్నికల సంఘం సదరు అధికారులపై కొరడా ఝళిపించే అవకాశాలున్నాయి. తూర్పుగోదావరి, గుంటూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల కలెక్టర్లు అధికార పార్టీ అగ్రనేతలతో అంటకాగుతున్నారని ఎప్పట్నుంచో ఫిర్యాదులు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక కూడా వారు తీరుమార్చుకోకుండా కొందరు పోటీపడి స్వామి భక్తి చాటుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
గుంటూరు, పల్నాడు, ప్రకాశం, విజయవాడ జిల్లాల ఎస్పీలతోపాటు నగర పోలీస్ కమిషనర్ సైతం వైసీపీకి అనుకూలంగా ఉన్నారంటూ ప్రతిపక్షాలు కూడా నేరుగా ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో ఈ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా అని ఈసీ సంశయిస్తోంది.! ఎన్నికల కోడ్ అమలులో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయాన్నీ కొందరు కలెక్టర్లు వైసీపీ పెద్దలకు చేరవేసినట్టు సమాచారం.
రాష్ట్రంలో విచిత్ర ఎన్నికల నియమావళి - వైఎస్సార్సీపీకి వర్తించని కోడ్ నిబంధనలు
కొందరు జిల్లా కలెక్టర్లు ఓ ముందడుగేసి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రభుత్వానికి అనుకూలంగా లేరని సీఎంకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి. మరోవైపు పల్నాడు జిల్లా బొప్పూడి వద్ద ఇటీవల ప్రధాని మోదీ పాల్గొన్న ప్రజాగళం సభలో పోలీసుల నిర్లక్ష్యాన్నీ ఈసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లౌడ్ స్పీకర్లు, లైట్లు ఏర్పాటు చేసిన స్టాండ్‌పైకి ఎక్కిన కార్యకర్తల్ని కిందకు దిగాలని స్వయంగా ప్రధాని మోదీ కోరినప్పుడు కూడా పోలీసులు ఆ దిశగా కదల్లేదని కేంద్ర నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.
పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ప్రధాని సభకు ఇంఛార్జులుగా వ్యవహరించారు. వీరంతా అధికార పార్టీకి అనుకూలంగా వీరు వ్యవహరిస్తున్నట్టు ఈసీ కూడా నివేదిక పంపినట్లు తెలుస్తోంది.