Deputy CM Bhatti Vikramarka Fires on BJP Govt : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు కేసులు పెడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై సీఎం ఏమీ తప్పుగా మాట్లాడలేదని, తప్పుడు కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని ఘాటుగా స్పందించారు. కొత్తగూడెం కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న ఆయన, ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల విషయంలో కేంద్ర సర్కార్ తీరును ఎండగట్టారు. అలానే బీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఖమ్మంలో థర్మల్ పవర్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకు వస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. సింగరేణిని కాపాడతామని, దీనిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనీయమని తెలిపారు. తాము రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ఇస్తున్నా, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కావాలనే తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
"ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది దళిత, గిరిజన రిజర్వేషన్లను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగం ద్వారా అందిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ వాటిని తొలగించటానికి సమాయాత్తమవుతోంది. దాన్ని పోరాటం చేస్తాం, కాపాడుతామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెబితే, అది తప్పు అన్నట్లు తప్పుడు కేసు పెట్టి దిల్లీకి పిలిపిస్తారా? దానికి మేమేం భయపడం."-భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి
ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం : మూసేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభిస్తామని వివరించారు. పదేళ్లుగా సింగరేణి సంస్థను, కార్మికులను నాటి గులాబీ పార్టీ అనేక ఇబ్బందులు పెట్టిందన్న భట్టి, వారికి రావాల్సిన ప్రయోజనాలు అడ్డుకున్నారని ఆక్షేపించారు. సింగరేణి బొగ్గుబావులను రక్షిస్తామన్న ఆయన, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు.
Minister Thummala on Farmer Issues : ఇందిరమ్మ రాజ్యం కావాలనే కాంగ్రెస్‌కు ప్రజలు అధికారం ఇచ్చారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తమ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో చూస్తామన్న కొందరకు బుద్ధి చెప్పేలా, 15 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి రేవంత్‌రెడ్డిని బలోపేతం చేయాలని కోరారు. ఈ ఎన్నికలు పూర్తయ్యాక రాష్ట్ర సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. రైతుకు కష్టం లేకుండా చూస్తామని, త్వరలోనే రైతుబంధు పెండింగ్ నిధులు వేస్తామని వివరించారు. అదేవిధంగా కొత్తగూడెం జిల్లా పామాయిల్ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.