Telangana Congress Joinings : జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురవ్వడంతో నేతల చేరికలకు కాంగ్రెస్ విరామం ప్రకటిస్తుందనే ప్రచారం జరిగింది. కానీ జీవన్‌రెడ్డిని దిల్లీకి పిలిపించుకుని బుజ్జగించిన ఏఐసీసీ, చేరికలు కొనసాగుతాయని స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇందుకు అనుగుణంగా వివాదాలు పునరావృతం కాకుండా ఏకాభిప్రాయంతో చేరికలు కొనసాగించేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది.
Deepa Das Munshi On Congress Joinings : తెలంగాణలో నేతల చేరికలకు తలుపులు తెరిచే ఉంటాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీపా దాస్‌మున్షీ స్పష్టం చేశారు. పార్టీలో చేరేందుకు వచ్చేవారిని వెనక్కి పంపించలేము కదా? అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేల చేరికలపై విమర్శలు చేసేవారు గతంలో ఏం చేశారో వెనక్కి తిరిగి చూసుకోవాలని బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
"కాంగ్రెస్ పార్టీ తలుపులు అందరి కోసం తెరిచే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం ఉంచి పార్టీలో చేరాలనుకునే ఎమ్మెల్యే కోసం దర్వాజలు తెరిచే ఉంటాయి. ఇదే సమయంలో మా పార్టీ నాయకుల మనోభావాలు ఏ విధంగానూ దెబ్బతీయం. వారిని కలుపుకొని ముందుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు చాలామంది చేరారు. ఇకపై కూడా చాలామంది వచ్చి చేరుతారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలంగా ఉంది"- దీపా దాస్‌మున్షీ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి
అటు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల దిల్లీ పర్యటనలో పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమించాలి? ఏ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి? అనే విషయాలపై సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మధుయాస్కి, సంపత్ కుమార్, బలరాం నాయక్, సురేష్ షెట్కార్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులతోపాటు పలువురు మంత్రుల పేర్లు కూడా తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు : ఐతే మంత్రులుగా ఉన్నవారు పార్టీని సమర్థంగా నడిపేందుకు అవకాశం ఉండదన్న భావనకు ఏఐసీసీ వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమర్థవంతంగా పార్టీకి సేవలు అందించడంతోపాటు ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ ముందుకు వెళ్లే నాయకత్వం కావాలని యోచిస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డితో పాటు దీపా దాస్‌మున్షీ సహా మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు లాంటి సీనియర్లతో చర్చించిన తర్వాతే ఏఐసీసీ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
పీసీసీపై నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుంది : పీసీసీ పదవీకాలం ముగింపు అంటూ ఏమీ లేదన్న దీపా దాస్‌మున్షీ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. 'పీసీసీ పదవీకాలం పూర్తవుతుందనే మాట ఎందుకు వస్తుందో నాకు అర్థం కావడం లేదు. పీసీసీ పదవీకాలం ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు మొదలవుతుందనేది పార్టీ నిర్ణయం. పీసీసీపై నిర్ణయం అధిష్ఠానమే తీసుకుంటుంది. శాసనసభ, లోక్‌సభ తరహాలో ఐదేళ్ల తర్వాత మార్పు చేయాలనే విధానం లేదు' అని దీపాదాస్ మున్షీ తెలిపారు.
Congress Focus On Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ పెద్దల వద్ద చర్చకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ఏ సామాజిక వర్గాల వారు ఉన్నారు? ఏ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు? పార్టీ బలోపేతం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆరుగురిని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవిపైనా స్పష్టత రాలేదు. ఆరు మంత్రిత్వ శాఖల్లో రెండు రెడ్డి, రెండు బీసీ, ఒకటి ఎస్టీ, మరొకటి మైనార్టీ లేదా ఎస్సీ సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో బెర్త్‌కోసం నాయకులు పెద్ద సంఖ్యలో పోటీపడుతున్నారు.
నామినేటెడ్ పదవుల విషయంలో : ప్రభుత్వం ప్రకటించిన 37 మంది నామినేటెడ్ పదవుల్లో కొందరి నియామకంపై మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కూడా దిల్లీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ 37 మందిని కొనసాగించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నప్పటికీ తమకు తెలియకుండానే నియమించిన వారిని తొలగించి ప్రత్యామ్నాయ నియామకాలు చేపట్టాలని కొంతమంది మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఐతే ఏదో విధంగా సర్ది చెప్పి ఆ 37 మంది నామినేట్ పదవుల పేర్లను అధికారికంగా ప్రకటించి జీఓలు ఇచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana Congress : కాంగ్రెస్‌లో తాత్కాలికంగా ఆగిన చేరికలు.. ఆ తర్వాతనే మళ్లీ జోరు