Telangana Congress Protest at Gun Park : దేశానికి రూ.183 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, 16 మంది ప్రధానులు చేసిన అప్పు కంటే నరేంద్ర మోదీ రెండింతలు ఎక్కువ అప్పు చేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ కలిసి దేశాన్ని దోచుకున్నారని ఆరోపించారు. సెబీ ఛైర్పర్సన్ అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
అదానీ వ్యవహారంపై, సెబీ ఛైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ అదానీ వ్యవహారాన్ని చట్టసభల్లో రాహుల్ గాంధీ బయటపెట్టారని అన్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని డిమాండ్ చేశామని, అందుకే అన్ని ఈడీ కార్యాలయాల వద్ద ధర్నా చేయాలని ఏఐసీసీ ఆదేశించిందని తెలిపారు.
వర్సిటీలు, ప్రాజెక్టులను మొదలుపెట్టిన దార్శనిక ప్రధాని నెహ్రూ. ఇందిరాగాంధీ భూసంస్కరణలు ప్రవేశపెట్టి బలహీనవర్గాలకు భూములు పంచారు. రాజీవ్ గాంధీ తెచ్చిన సాంకేతిక విప్లవం వల్లే ఐటీ అభివృద్ధి సాధ్యమైంది. పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచారు. అయితే ప్రస్తుతం దేశాన్ని మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీ చెరబట్టారు. - రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి
"ప్రధాని అక్రమాలపై విచారణ చేయాల్సిన సెబీ పెద్దలే ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అతనితో చేతులు కలిపారు. హిండెన్ బర్గ్ అనే సంస్థ అదానీ అక్రమాలపై ఆధారాలు కూడా బయటపెట్టింది. మోదీ, అదానీ కలిసి దేశాన్ని దోచుకుంటున్నారని ప్రజల ఆస్తులు కాజేస్తున్నారని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. అలా అడిగినందుకు ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేశారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప అదానీ తప్పులపై మాత్రం చర్యలు లేవు. అందుకే ఈడీ ఆఫీసు ముందు నిరసన తెలుపుతున్నాం." అని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
దేశ సంపదను కొల్లగొడుతున్నారు : అప్రజాస్వామికంగా దేశ సంపదను కొల్లగొడుతున్నారుని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అదానీ అక్రమ ఆస్తులపై జాయింట్ పార్లమెంట్ కమిటి వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అదానీ అక్రమాలపై జేపీసీ వేస్తే ఇబ్బంది ఏంటి? అని ప్రశ్నించారు. అదానీ ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని లేదంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని వ్యాఖ్యానించారు. అవినీతికి పెద్దన్నగా నరేంద్ర మోదీ వ్యవహరించారుని విమర్శించారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అదానీకి అప్పగిస్తున్నారని, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే సీబీఐ, ఈడీతో దాడులు చేయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.