Congress Whip on Raghunandan Rao : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చదువుకున్నది ఏడో తరగతని, ఆయన చేసే పని గోడలకు వేసే సున్నమని, అలాంటి వాళ్లకు బడ్జెట్ అర్థం కాదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ చదువు మీద రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్‌లు బీర్ల అయిలయ్య, అడ్లూరి లక్ష్మణ్‌లు తీవ్రంగా ఖండించారు. శనివారం అసెంబ్లీలోని మీడియాపాయింట్లో మీడియాతో మాట్లాడారు.
ఆ ఎంపీ మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీర్ల అయిలయ్య ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శవంతమైన బడ్జెట్ పెడితే వక్రీకరిస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. దిల్లీ నుంచి నిధులు తీసుకురాకుండా ఉత్తి చేతులతో వస్తే ప్రజలు ఛీ కొడతారని, అందుకే ఆ పార్టీ ఎంపీ సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ కుర్చీ కోసం పెట్టినట్లు ఉందని విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా తీసుకురాని వారు సీఎం రేవంత్‌ను విమర్శించే నైతిక హక్కులేదన్నారు. బీఆర్ఎస్ అమ్ముడుపోవడం వల్లే బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచిందని ఆరోపించారు.
ప్రధాని మోదీ ఏం చదివారు : ప్రధాని నరేంద్రమోదీ ఏమి చదువుకున్నారో చెప్పగలరా అంటూ ఎంపీ రఘనందన్‌రావును ఉద్దేశించి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కు అవడం వల్లే ఎంపీగా గెలిచావని విమర్శించారు. కేసీఆర్ పక్కన ఉండి వెన్నుపోటు పొడిచావని ఆరోపించారు. రఘునందన్ రావు ఎంపీగా ఎట్లా గెలిచారో రాష్ట్ర ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. బ్లాక్ మెయిల్ చేసి లబ్ధి పొందే తన మాట్లాడేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకురావడం చేతకాక ప్రజల దృష్టి మరల్చేందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆక్షేపించారు.
'మా ముఖ్యమంత్రి చదువు మీద, పనితీరు మీద మాట్లాడుతున్నారు. ఒక మంచి ఆదర్శనీయమైన రాష్ట్ర బడ్జెట్ పెడితే దానిమీద కూడా అవహేళన చేసి మాట్లాడుతున్న ఎంపీ రఘనందన్‌రావుకు తెలంగాణ ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారు. ఈరోజు ప్రధానిగా ఉన్న నరేంద్రమోదీ ఏం చదవుకున్నారో చెప్పగలరా? నీ నైజం ఏంటో తెలంగాణ ప్రజలు తెలియదా?'- ప్రభుత్వ విప్‌లు