Congress Leaders Are Seeking for Party Posts : అసెంబ్లీ సమావేశాలకు ముందే నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందరూ భావించారు. కానీ సామాజిక సమీకరణాల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడం, అసెంబ్లీ సమావేశాలు, విదేశీ పర్యటన ఉండటంతో వాయిదా పడింది. రేవంత్ తన విదేశీ పర్యటన ముగించుకుని వచ్చి, మరుసటి రోజు స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న తర్వాత సీఎం, పీసీసీ హోదాలో పార్టీ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పీసీసీ పదవికి నలుగురి మధ్యే ప్రధాన పోరు : కొత్త పీసీసీ పదవి కోసం ప్రస్తుత పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఎంపీ బలరాం నాయక్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌లు ప్రధాన పోటీ దారులుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నలుగురు ఎవరికి వారు పార్టీ అధిష్ఠానం వద్ద లాబీయింగ్ చేసుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నందున కొత్తగా ఎంపిక అయ్యే పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డితో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాల్సి ఉన్నందున ఈ నలుగురిలో ఎవరికి అవకాశం దక్కుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
అంతేకాదు ఆ నలుగురిలో సీఎం రేవంత్ రెడ్డి ఎవరివైపు మొగ్గు చూపుతారోనన్న ఉత్కంఠతతో అందరూ వేచి చూస్తున్నారు. అయితే పీసీసీ సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నందున ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తనకే పీసీసీ పదవి వస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏఐసీసీ కార్యదర్శిగా, ఏఐసీసీ పెద్దలతో తనకున్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని తనకే పీసీసీ పదవి వచ్చి తీరుతుందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బలరాం నాయక్ పీసీసీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించాలని అధిష్ఠానం వద్ద పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తమ ఎస్టీ వర్గానికి ఇవ్వలేదని పేర్కొంటున్న బలరాం నాయక్, సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీల మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి పోటీ : మరోవైపు ప్రస్తుత పీసీసీ కమిటీలో ప్రచార కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ మధుయాష్కీ పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మధుయాష్కీకి ముందు నుంచి కూడా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, ప్రియాంక గాంధీలతో సత్సంబంధాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డిలు సిఫారసు చేస్తే పీసీసీ అధ్యక్షుడిగా మధుయాష్కీ ఎంపిక కావడం ఖాయమన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
కొత్త పీసీసీ కార్యవర్గం ఏర్పాటైనట్లయితే సామాజిక సమీకరణాల వారీగా నాలుగు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లల్లో ఒకటి భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డికి దక్కుతుందని పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. మిగిలిన మరో 4 వర్కింగ్ ప్రెసిడెంట్లల్లో ఎస్సీ సామాజిక వర్గానికి ఒకటి, యాదవ సామాజిక వర్గానికి ఒకటి, ఎస్టీ సామాజిక వర్గానికి ఒకటి, మైనారిటీ సామాజిక వర్గానికి ఒకటి లెక్కన పదవులు దక్కుతాయిని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచార కమిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
త్వరలో జాతీయ స్థాయిలో ఏఐసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యే అవకాశం ఉండడంతో ఏఐసీసీ కార్యదర్శల పదవుల కోసం రాష్ట్రానికి చెందిన కొందరు నాయకులు దిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న హర్కర్ వేణుగోపాల్, మాజీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్‌లు ఏఐసీసీ కార్యదర్శుల కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలపై ఏకాభిప్రాయం కుదరకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కానీ, మల్ రెడ్డి రంగారెడ్డిలకు ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
దిల్లీలో మకాం వేసిన వి.హనుమంతరావు : మాజీ ఎంపీ వి.హనుమంతురావు గత కొన్ని రోజులుగా దిల్లీలోనే మకాం వేసి, ఓబీసీ సెల్ జాతీయ ఛైర్మన్‌గా తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో నలుగురికి పదవులు ఇచ్చి, మరో రెండు పదవులను తర్వాత చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే సామాజిక సమీకరణాలను సమతుల్యం చేసేందుకు నామినేటెడ్ పదవులు కూడా వీలైనంత త్వరగా భర్తీ చేస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి.