Congress Jana Jatara Meeting in Tukkuguda : తుక్కుగూడ వేదికగా శనివారం జరగనున్న జన జాతర సభను రాష్ట్ర కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ వేదికగానే హస్తం పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రకటించనుండగా దేశాన్ని ఆకర్షించేలా ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తుక్కుగూడలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభా ప్రాంగంణం మొత్తం కలియ తిరిగిన ఆయన పలువురు మంత్రులు, ముఖ్యనేతలతో సమావేశమై సభ విజయవంతంపై చర్చించారు.
తెలంగాణలో ఉన్న పరిస్థితులే దేశవ్యాప్తంగా : కాంగ్రెస్‌కి తెలంగాణలో ఉన్న పరిస్థితులే దేశవ్యాప్తంగా ఉన్నాయని కేంద్రంలో ఇండియాకూటమి అధికారంలోకి రాబోతోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో 14పార్లమెంట్ స్థానాల్లో గెలవబోతున్నామని, కాంగ్రెస్ టికెట్లు పొందినవారు చాలా అదృష్టవంతులు అన్నారు. దేశంలో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా, ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీకి ఎదురులేదన్నట్లు కావాలనే అతిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీల మాదిరిగానే దేశంలో ఐదు హామీలు రాబోతున్నాయని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
Lok Sabha Elections 2024 : జనజాతర సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర జాతీయస్థాయి నేతలు హాజరుకానుండగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఆ జనజాతర సభకు వచ్చేందుకుప్రజలు సిద్ధంగా ఉన్నారన్న మంత్రి శ్రీధర్‌బాబు ఆ సభ ద్వారా దేశానికి సంబంధించిన మేనిఫెస్టోను ప్రజల ముందు పెడతామని వెల్లడించారు.
తుక్కుగూడ (Tukkuguda Jana Jatara Meeting)జనసమీకరణపై నియోజకవర్గాల‌్లో మంత్రులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు విస్తృతంగా సమావేశాలు నిర్వహించిన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోని హస్తం పార్టీ పాలన మోడల్‌ని దేశానికి అందించాలంటే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క విజ్ఞప్తి చేశారు. దేశంలో మత కల్లోలం రేపుతూ రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధిచెప్పేలా కాంగ్రెస్‌కు అండగా ఉండాలని సూచించారు.
"గతంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నాం. అక్కడి నుంచి కాంగ్రెస్ అధినాయకత్వం ఆరు గ్యారంటీలను ప్రకటించింది. వాటిని రాష్ట్రంలో అమలు చేస్తున్న తరుణంలో తెలంగాణ మోడల్‌ను దేశానికి అందించాలనే లక్ష్యంతో మరోసారి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఇక్కడి నుంచే దేశానికి గ్యారంటీ ఇచ్చేలా మేనిఫెస్టో ప్రకటిస్తుంది. ఈ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. - భట్టి విక్రమార్క, ఉప ముఖ్యమంత్రి
Congress Public Meeting Arrangements in Tukkuguda : తుక్కుగూడ వేదికగా నిర్వహించే సభలో జాతీయ మేనిఫెస్టోలో 5 న్యాయ్‌లు, 25 గ్యారంటీలను తెలుగులో ప్రకటించనున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తెలిపారు. ఆ సభను విజయవంతం చేయాలని యాదాద్రిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. జనజాతర సభకు కార్యకర్తలు జనజాతరలా తరలిరావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించేందుకు శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.