Congress Election Campaign In Telangana : హనుమకొండ జిల్లా పరకాలలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ సమావేశానికి వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య హాజరయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసరాలు ధరలు, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటాయని కడియం కావ్య అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని కావ్య వెల్లడించారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
నాంపల్లి బంగారు మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశ అభ్యున్నతి కోసం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ప్రజలు, కార్యకర్తలపై ఉందని దానం ఉద్ఘాటించారు. కరీంనగర్‌లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్‌రావు నామినేషన్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. లోక్‌సభ తొలివిడత పోలింగ్ పూర్తి కాగానే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని అందుకే దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
Peddapalli congress MP Candidate Campaign : పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎలిగేడు మండల కేంద్రంలో కార్యకర్తలతో కలిసి లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పారిశ్రామికవేత్తగా పేరున్న తనను ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గం పరిథిలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారసభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. దేశంలోనే అత్యధిక మెజారిటీతో రఘువీర్‌రెడ్డిని గెలిపించాలని మంత్రి ఆకాంక్షించారు.
ప్రతి ఒక్కరికి కొత్త తెల్లరేషన్ కార్డులు : ఎన్నికలు ముగియగానే ప్రతి ఒక్కరికి కొత్త తెల్లరేషన్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఎన్నికల ప్రచారంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ చేతి గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. పార్లమెంటరీ ప్రజాస్వామిక దేశంలో రాజ్యాంగం ప్రమాణికమనీ, అలాంటి వాటికి తిలోదకాలిచ్చిన మోదీ ప్రభుత్వం, దేశ సంపదను పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని మంత్రి సీతక్క ధ్వజమెత్తారు.
' మోదీ పది సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏం చేశారు? ఉన్న రాజ్యాంగాన్ని మార్చేస్తారని అంటున్నారు. బీజేపీ దేవుడిని రాజకీయం చేస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని ప్రయత్నిస్తోంది. విభజించు పాలించు అనే బీజేపీ విధానాలను కాంగ్రెస్ కార్యకర్తలు తిప్పికొట్టాలి. దయచేసి ఆలోచించి పేదింటి బిడ్డ సుగుణకు ఓటేసి చెయ్యి గుర్తును గెలిపించండి.'- సీతక్క, గిరిజన సంక్షేమశాఖమంత్రి