Congress Candidates Election Campaign in Telangana : లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. దేశంలో గాడితప్పిన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే, రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని పీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన చేస్తోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో కలిసి మాట్లాడారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరంలోని ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. రాజ్యాంగాన్ని మార్చేసి బడుగు బలహీన వర్గాలను మరీ పేదలుగా మార్చే ఆలోచనలో బీజేపీ ఉందని ఆరోపించారు. రాజ్యాంగం, రిజర్వేషన్లు తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్‌లోని పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రిజర్వేషన్లు తొలగించేందుకే 400 సీట్లను బీజేపీ కోరుతోందని భట్టి విమర్శించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్, దౌల్తాబాద్, తొగుట మండలాల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి నీలంమధు ప్రచారం చేశారు. దుబ్బాకలో మధుకు మద్దతుగా చేసిన మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్, బీజేపీకు డిపాజిట్లు గల్లంతు చేయాలని ఓటర్లకు సూచించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, వేములవాడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో బీజేపీపై విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణకు మద్దతుగా ప్రచారం చేసిన మంత్రి శ్రీధర్‌బాబు రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీను నిలువరించేలా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు.
నల్గొండ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థికి అదిక మెజారిటీ కట్టబెట్టేలా కృషి చేయాలని శ్రేణులను మాజీ మంత్రి జానారెడ్డి కోరారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూరలో కార్నర్ మీటింగ్‌కు ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యే జై వీర్‌తో కలిసి పాల్గొన్నారు. హాలియాలో యూత్ కాంగ్రెస్ సమ్మేళనంలో అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే జై వీర్ హాజరయ్యారు.
వరంగల్ జిల్లా ఖానాపురంలోని పలుతండాల్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయన్‌కి మద్దతుగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో బలరాం నాయక్ గెలుపు కోరుతూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలే లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులు క్షేత్రస్థాయిలో సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
'అబద్ధాలు, విద్వేషాన్ని తిరస్కరించాలి- మెరుగైన భవిష్యత్తు కోసం ఓటు వేయండి' - lok sabha election 2024