CM Revanth Reddy Chit Chat with Media : ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చివేసిందని చెప్పారు. జన్వాడ ఫామ్‌హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్లో కేటీఆర్ ప్రస్తావించలేదని సీఎం పేర్కొన్నారు. నిర్మాణాలకు అధికారులే అనుమతిస్తారు, సర్పంచులు కాదని కేటీఆర్‌కు తెలియదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు.
తన కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. విద్యాసంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. ప్రస్తుతానికి హైదరాబాద్‌కు మాత్రమే హైడ్రా పరిమితం అని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఆక్రమణల తొలగింపే తొలి ప్రాధాన్యమని తేల్చి చెప్పారు. అలాగే చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపే తొలి ప్రాధాన్యం అని అన్నారు.
చెరువుల ఆక్రమణలపై నిజనిర్ధరణ కమిటీ : 30 ఏళ్ల క్రితం నిర్మించిన కట్టడాలైనా హైడ్రా చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చెరువుల ఆక్రమణలపై నిజనిర్ధరణ కమిటీ వేస్తామని వెల్లడించారు. హరీశ్‌రావు నేతృత్వం వహిస్తానంటే ఆయన నేతృత్వంలోనే కమిటీ వేస్తామని ఎద్దేవా చేశారు. హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయి, వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు.
జలాశయాల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై విచారణ : చెరువుల్లోని ఆక్రమణలపై అధ్యయనం జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలని అందుకే వారి నిర్మాణాలపై దృష్టి పెట్టామని చెప్పారు. హైడ్రా ఏర్పాటుకు చట్టం అవసరం లేదని జీవో ఉంటే చాలన్నారు. జీవో 111పై సుప్రీంకోర్టు, ఎన్జీటీ మార్గదర్శకాల మేరకు నడుచుకుంటామని వివరించారు. జీవో 111పై గత ప్రభుత్వం మభ్యపెట్టేలా వ్యవహరించిందన్నారు. జలాశయాల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన అధికారులపై విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కవితకు 5 నెలల్లో బెయిల్ రావడంపై చర్చ సాగుతోంది : కవితకు 5 నెలల్లోనే బెయిల్ రావడంతో చర్చ జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కవితకు బెయిల్ ఇవ్వడాన్ని తప్పుపట్టట్లేదని చెప్పారు. మనీశ్ సిసోదియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టిందని తెలిపారు. కేజ్రీవాల్‌కు ఇప్పటికీ బెయిల్ రాలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పని చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు, కవిత బెయిల్‌కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికలకు, కవిత బెయిల్‌కు సంబంధం ఉందన్న చర్చ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, 22,37,848 ఖాతాలకు రూ.17,939 కోట్ల రుణమాఫీ జరిగిందని అన్నారు. రుణమాఫీ కానివారి జాబితాను కేటీఆర్, హరీశ్‌రావు ఇవ్వాలని కోరారు.