CM Revanth On Telangana Cabinet Expansion : దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రతిపక్షాలు పలు శాఖలకు మంత్రులు లేరని ఆరోపిస్తున్నారన్న రేవంత్, విద్యాశాఖ తన వద్దే ఉందని తెలిపారు. ఒక నిర్దిష్ట ప్రణాళికా ప్రకారం ముందుకెళ్తున్నామని వివరించారు. దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రేవంత్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.
అన్ని శాఖలకు సమర్థమైన మంత్రులున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడి మంత్రులు మెరుగ్గా ఉన్నారో లేరో చూడాలని ప్రతిపక్షాలకు సూచించారు. అభివృద్ధి పనుల కోసం మంత్రులు కేంద్రమంత్రులను కలుస్తున్నారని తెలిపారు. 6 సంక్షేమ పథకాలను అమలు చేయడమే ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు.
రాష్ట్రంలో పలు శాఖలకు మంత్రులు లేరని ఆరోపిస్తున్నారు. అన్ని శాఖలకు సమర్థవంతమైన మంత్రులున్నారు. విద్యా శాఖ నా వద్దే ఉంది. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడి మంత్రులు మెరుగ్గా ఉన్నారో లేరో చూడాలి. అభివృద్ధి పనుల కోసం మంత్రులు కేంద్రమంత్రులను కలుస్తున్నారు. ఆరు సంక్షేమ పథకాలను అమలు చేయడమే ధ్యేయం. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేయడానికి నిర్ణయించాం. - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఇదే సమయంలో పార్టీ ఫిరాయింపులపై స్పందించిన సీఎం, ఫిరాయింపులకు పునాది వేసిందే కేసీఆర్ అని ఆక్షేపించారు. గతంలో 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కేసీఆర్ లాక్కున్నారన్న రేవంత్, ఫిరాయింపులను ప్రోత్సహించినందుకు కేసీఆర్ ముక్కు నేలకు రాయాలని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కూలిపోతుందని కేటీఆర్, హరీశ్ అన్నారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీశ్ మాటలకు అప్పట్లో బీజేపీ వంతపాడిందన్నారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వాన్ని కూలగొడతామని బీఆర్‌ఎస్, బీజేపీ రంకెలేశాయన్న రేవంత్ రెడ్డి, అలాంటి మాటలు మాట్లాడుతుంటే గాలికి వదిలేయాలా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకోవడమే కేసీఆర్ భావదారిద్ర్యమని దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటింగ్ శాతం 16 శాతానికి తగ్గిందన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్‌కు ఇప్పటికీ కనువిప్పు కలగలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకే ఎంపీ ఎన్నికల్లో బీజేపీని కేసీఆర్ గెలిపించారని ఆరోపించిన రేవంత్, కంచుకోటగా చెప్పుకునే మెదక్‌లో ఆ పార్టీ మూడో స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటికైనా ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.
జీవన్ రెడ్డి అనుభవాలను వినియోగించుకుంటాం : మరోవైపు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ దృష్ట్యా నిధుల కోసం కేంద్రమంత్రులను కలుస్తున్నామని, త్వరలో ప్రధాని, కేంద్రమంత్రులను కలుస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో జీవన్ రెడ్డి వ్యవహారంపై స్పందించిన సీఎం, జీవన్ రెడ్డి అనుభవాలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు. జీవన్ రెడ్డి చర్యల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరగాలని చూశారన్న ఆయన, కాంగ్రెస్ పట్ల జీవన్ రెడ్డికి ఉన్న నిబద్ధత వారికి అర్థం కాదన్నారు.