CM Revanth MP Election Campaign in Nagarkurnool : సార్వత్రిక ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో ఐదోసారి పర్యటించారు. నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ సందర్భంగా బిజినేపల్లిలో జరిగిన జన జాతర సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. పదేళ్ల కేసీఆర్ హయాంలో రాష్ట్రం నాశనమైందన్న రేవంత్ రెడ్డి, ఒక్కో పనిని చక్కదిద్దుతూ వస్తున్నామన్నారు.
Revanth Reddy Challenge to BRS Leaders : రుణమాఫీపై బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొట్టిన సీఎం, పంద్రాగస్టులోగా మాఫీ చేస్తే పార్టీ గుర్తింపు రద్దు చేసుకుంటారా అని ప్రశ్నించారు. పదేళ్లు ఎస్సీ వర్గీకరణను అడ్డుకున్న కేసీఆర్ పక్కన ఆర్‌ఎస్ ప్రవీణ్ ఎందుకు చేరారని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు ఓటేసినా, అది భారతీయ జనతా పార్టీకే వెళ్తుందన్న రేవంత్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు ప్రజల కలలు కాంగ్రెస్‌తోనే సాకారమవుతాయన్నారు.
బీఆర్ఎస్ హయాంలో పాలమూరు నేలకు అన్యాయం జరిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికే ఆదర్శవంతమైన నాయకులను ఇచ్చిన గడ్డ పాలమూరు అని కొనియాడారు. 70 ఏళ్ల తర్వాత సీఎం పదవి ఇక్కడి బిడ్డకు దక్కిందన్నారు. గతంలో కరీంనగర్‌లో ఓటమి భయంతోనే, కేసీఆర్ పాలమూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారని ఎద్దేవా చేశారు. కానీ ఇక్కడి ప్రజలు కేసీఆర్‌ను పార్లమెంట్‌కు పంపిస్తే, వారికి అన్యాయం చేశారని ఆరోపించారు.
"ఎవరికైతో వ్యతిరేకంగా ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ రాజీనామా చేశారో, ఎవరినైతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తిరస్కరించారో వారి దగ్గరికే ఇవాళ ఆయన వెళ్లారు. కేసీఆర్‌ను ఎందుకు భుజాన వేసుకొని తిరగాలనుకుంటున్నారు. ఈ పదేళ్లు మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటే, మమ్మల్ని భయటపడేసిన చంద్రశేఖర్ రావు పక్కన చేరారంటే, ఇవాళ మీరు వర్గీకరణకు వ్యతిరేకమా?"-రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
CM Revanth Comments on Rs Praveen Kumar : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉందని సీఎం పేర్కొన్నారు. దొంగలకు సద్ది మూటలు మోసే నేతలు మన జిల్లాలో కొందరు ఉన్నారని, అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డీకే అరుణ, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌తో తనకు వివాదం ఏమీ లేదన్న ఆయన, శాసనసభ ఎన్నికల్లో గద్వాల బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదని గుర్తు చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్‌కు రాజీనామా చేస్తే, తాము అండగా నిలబడ్డామని సీఎం చెప్పుకొచ్చారు.
నాడు దొరల పెత్తనాన్ని సహించలేక రాజీనామా చేస్తున్నానన్న ఆయన, ఇప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడాలంటే కాంగ్రెస్‌లోకి రావొచ్చు కదా అన్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా ఆర్‌ఎస్ ప్రవీణ్‌ను నియమించాలనుకున్నాం కానీ, ఆయన తిరస్కరించారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఆయన ఐపీఎస్‌గా ఉండి ఉంటే, కాంగ్రెస్ సర్కార్ డీజీపీగా నియమించేదని తెలిపారు.
పాలమూరును బంగారు నేలగా మార్చుకునే అవకాశం : బీఆర్ఎస్ను 4 కోట్ల తెలంగాణ ప్రజలు గోతిలో పూడ్చి పెట్టారని, మళ్లీ అటువంటి వారి పంచనే ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేరటం శోచనీయమన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో మోదీ ఒకరకంగా మోసం చేస్తే, కేసీఆర్ మరో రకంగా మోసం చేశారని దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్ వ్యతిరేకంగా పని చేశారన్న రేవంత్ రెడ్డి, డాక్టర్ మల్లు రవిని ఎంపీగా దిల్లీకి పంపితే, తాము రిజర్వేషన్లపై కొట్లాడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్తికాలం అధికారంలో ఉంటుందన్న ఆయన, పాలమూరులోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలానే బంగారు నేలగా మారుస్తామని చెప్పుకొచ్చారు.