CM Revanth Election Campaign in Bengaluru : ఈ ఎన్నికలు దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బెంగళూరుకు ఐటీ నగరంగా గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. హస్తం కృషి వల్లే ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని గుర్తు చేశారు. బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్‌ను మూడుసార్లు గెలిపిస్తే బెంగళూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ఈ ప్రాంతానికి కావాల్సిన నిధుల గురించి ఏనాడు ఆయన అడగలేదని విమర్శించారు. కర్ణాటక లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో ఆయన మాట్లాడారు.
Revanth Karnataka Tour 2024 : తాగునీటి సమస్యతో బెంగళూరు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పీసీ మోహన్ కేంద్రం నుంచి నిధులు అడగడం లేదని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కావేరీ జలాల వివాదం పరిష్కారం గురించి మాట్లాడరని, ఏ రోజైనా ఆయన లోక్‌సభలో కర్ణాటక సమస్యల గురించి మాట్లాడారా అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ, పదేళ్లలో 7,21,680 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు.
ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా : రేవంత్‌రెడ్డి - CM Revanth in Jana Jathara Sabha
"దేశంలో 62 శాతం యువత నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తున్నందుకు నరేంద్ర మోదీకి ఓటు వేయాలా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రధాని, రైతులను కాల్చి చంపినందుకు ఓటు వేయాలా? అన్నదాతల ఆదాయం రెట్టింపు చేయలేదు సరికదా, కర్షకులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులను ప్రధాని కల్పించారు. నల్లధనం వెనక్కి రప్పించి జన్‌ధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు. మీలో ఎవరికైనా రూ.15 లక్షలు మీ ఖాతాల్లోకి వచ్చాయా?." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
'నరేంద్ర మోదీ అంటేనే నమ్మించి మోసం చేయడం. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీ నేతలను ఒక్కటే అడుగుతున్నా యడియూరప్ప మీ ఎలక్షన్ కమిషన్ మెంబర్, ఆయన కుమారుడు విజయేంద్ర కర్ణాటక పార్టీ అధ్యక్షుడు. మరో కుమారుడు రాఘవేంద్ర ఇప్పుడు పార్లమెంట్‌కు పోటీ చేస్తున్నారు. పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ, గోపీనాథ్ ముండే ఇద్దరు కుమార్తెలు ఎంపీలు. రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి, ఆయన కుమారుడు ఎమ్మెల్యే. మీ పార్టీలో ఉన్నవారంతా చేసేవి కుటుంబ రాజకీయాలే. మీరా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడేదని' రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది : బీజేపీ నేతలు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని రేవంత్‌రెడ్డి అన్నారు. దేవెగౌడ, ఆయన కుమారుడు దేశంలోనే అత్యంత అవినీతిపరులని కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ అన్నారని, మరి ఈ ఎన్నికల్లో వారితో పొత్తు ఎలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. వారిని ప్రధాని పక్కనెలా కూర్చోబెట్టుకున్నారు? అని అన్నారు. మోదీ చెప్పేదొకటి, చేసేదొకటని రేవంత్‌రెడ్డి విమర్శించారు.
"మోదీకి కావాల్సింది కేవలం ఎన్నికల్లో గెలవడమే, కానీ కర్ణాటక ప్రజల సంక్షేమం కాదు. ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలను అమలు చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న హస్తం పార్టీకి ఓటు వేస్తారా? నమ్మించి మోసం చేసే నమోకు ఓటు వేస్తారో ఆలోచన చేయండి. గుజరాత్‌కు 7 కేబినెట్ పదవులు, యూపీకి 12 కేబినెట్ పదవులు, కానీ 27 ఎంపీలను ఇచ్చిన కర్ణాటకకు కేవలం ఒక్క కేబినెట్ పదవి ఇచ్చారు. ఇది కన్నడ ప్రజలను అవమానించడం కాదా?." - రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి
'యూపీ, గుజరాత్‌లోనే సమర్థులు ఉన్నారా? కర్ణాటక, తెలంగాణలో లేరా?. ఇవి ఎన్నికలు కాదని, రెండు పరివార్‌ల మధ్య జరిగే యుద్ధం. ఈవీఎం, ఈడీ, ఐటీ, సీబీఐ, అదానీ, అంబానీ అంతా మోదీ పరివార్. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మా పరివార్. ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి 20 మంది ఎంపీలను గెలిపించండి. మన్సూర్ అలీఖాన్‌కు మద్దతుగా నిలిచి గెలిపించండి. తెలంగాణలో 17 సీట్లకు 14 సీట్లు గెలిపించుకుంటాం. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని' రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.