CM Jagan Meeting With YSRCP Leaders : వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఏవీ రావని ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. పేదలు బాగు పడాలంటే తిరిగి పార్టీ అధికారంలోకి రావాలనే విషయాన్ని ఇంటింటికీ తిరిగి చెప్పాలని నిర్దేశించారు. జగన్‌కు ఓటు వేయకపోతే వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలు కావాలని, పథకాలు వద్దు అని సంతకం పెట్టి ఇచ్చినట్లేనని అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న సీఎం వచ్చే ఎన్నికలకు సన్నద్దత సహా పలు కీలక అంశాలపై పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
జగన్ తిరిగి సీఎంగా రాకపోతే పేదల బతుకు చిన్నాభిన్నం అవుతాయని ప్రతి పేదవాడికి చెప్పాలని నిర్దేశించారు. ఓట్ల కోసం చంద్రబాబు ఏదైనా చెబుతారని, ఎవరినైనా మోసం చేస్తారని విస్తృతంగా ప్రచారం చేయాలని హూకుం జారీ చేశారు. 57 నెలల కాలంలో ఎవరి ఊహకు అందని విధంగా పరిపాలన చేశామన్న జగన్, మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలన్నింటినీ అమలు చేశామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ 87 శాతం పైగా ఇళ్లకు సంక్షేమ పథకాల ద్వారా మంచి చేశామన్నారు. బటన్ నొక్కి 2 లక్షల 55 వేల కోట్లను రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఖాతాల్లో జమ చేశామన్నారు. ప్రతి గ్రామంలో, మండలం, నియోజకవర్గంలో మెజారిటీ రావాలని, ఆ దిశగా వచ్చే 45 రోజుల్లో కష్టపడి పని చేయాలని జగన్ ఆదేశించారు. నిబద్దత, చిత్తశుద్ది వైఎస్సార్సీపీకి మాత్రమే ఉందన్నారు.
ఇన్‌ఛార్జిల మార్పుపై సీఎం జగన్ కసరత్తు - త్వరలోనే మారిన అభ్యర్థుల జాబితా
గతంలో 151 సీట్లు వచ్చాయని గుర్తు చేశారు. ఈ సారి 175కు 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 కు 25 ఎంపీ స్థానాలు రావాల్సిందేనని ఆ దిశగా అడుగులు పడాలని నిర్దేశించారు. ఇవాళ జరుగుతోంది కేవలం కులాల మధ్య యుద్దం కాదని, క్లాస్ వార్ అని అన్నారు. పేదలు ఓ వైపు, పెత్తందారులు మరో వైపున ఉన్నారన్నారు. కుప్పం నియోజక వర్గంలోనే 93.23 శాతం ప్రజలకు మంచి చేశామన్న సీఎం, ఆ నియోజక వర్గంలోనే 87 వేల ఇళ్లు ఉంటే 83 వేల ఇళ్లకు మంచి జరిగిందన్నారు. కుప్పం నియోజక వర్గంలోనే 83 వేల ఇళ్లకు 1400 కోట్లు ఇచ్చామన్నారు.
నిన్న ఫుల్ - నేడు నిల్ - కుప్పానికి హంద్రీనీవా జలాల 'సినిమా సెట్టింగ్'
ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని జగన్ అన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చామని, వివక్ష, లంచాలు లేకుండా పారదర్శకంగా పథకాలు అమలు చేశామన్నారు. పార్టీలో దాదాపు అన్ని సీట్లు దాదాపు ఖరారు చేశామన్న సీఎం, ఇప్పటికే 99 శాతం సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసినట్లు స్పష్టం చేశారు.