Chandrababu review on flood : వరద బాధితులకు 100 శాతం ఆహారం పంపిణీ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. NDRF బృందాలు చేరుకోలేనిచోటకు హెలికాఫ్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం అందించాలని సూచించారు. వరద సహాయక చర్యలు, ఉదయం నుంచి జరిగిన ఆహారం పంపిణీపై విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారుతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. 5 హెలీకాప్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు. 5 లక్షల ఆహారం, నీళ్ల ప్యాకెట్లు అందిస్తున్నట్లు వివరించారు. క్షేత్ర స్థాయిలో ఆహారం అందిందీ లేనిదీ అధికారులు నిర్థారించుకోవాలని అన్నారు. రెండ్రోజులు వరదలో చిక్కుకుని ఆహారం, నీరు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. మన కుటుంబమే అలాంటి కష్టంలో ఉందనే ఆలోచనతో అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు పనిచేయాలని సూచించారు. నీరు తగ్గుతున్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు.
ఏపీలో వర్ష బీభత్సం - 19 మంది మృతి - ఇద్దరు గల్లంతు: ప్రభుత్వం వెల్లడి - Heavy Rains and Floods in AP
విపత్తు నిర్వహణలో సరిగ్గా పని చేయకుటే, మంత్రులకైనా వేటు తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. జక్కంపూడిలో విధులు సరిగా నిర్వర్తించని ఓ అధికారిని ఇప్పటికే సస్పెoడ్ చేశానని తెలిపారు. వీఆర్ లో పెట్టిన అధికారులు విపత్తు నిర్వహణ బాధ్యతల్లో సక్రమంగా విధులు నిర్వర్తించలేదనే ఫిర్యాదులు ఉన్నాయన్న సీఎం, దీనిపైనా విచారణ జరిపిస్తున్నానన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వివాదాస్పద అధికారులకు బాధ్యతలు అప్పగింత మంచి ఉద్దేశంతో జరిగిందా లేక ఓవర్ లుక్ లో అయిందా అనేది పరిశీలిస్తున్నామన్నారు. ఏ రకంగా బాధ్యతలు అప్పగించినా పని చేయాలనే మానవత్వం సదరు అధికారులకు ఉండదా అని చంద్రబాబు మండిపడ్డారు.
టోల్ ఫ్రీ నెంబర్లు పనిచేయట్లేదనే ఫిర్యాదు అంగీకరిస్తున్నానన్నారు. ప్రభుత్వ వ్యవస్థ 5ఏళ్లుగా పక్షవాతం వచ్చినట్లుగా పడి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కంట్రోల్ రూమ్ వ్యవస్థ పెట్టి వెంటనే సమస్య పరిష్కరిస్తానన్నారు. బ్యారేజీ వద్దకు బోట్లు ఎలా కొట్టుకొచ్చాయని విచారణ జరిపిస్తున్నామన్నారు. తప్పుడు వార్తలు ఇచ్చి ఓ వర్గం మీడియా ఇంకా పరువు పోగొట్టుకోవద్దని చంద్రబాబు హితవుపలికారు.
జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరతా - కేంద్రానికి లేఖ రాస్తా: సీఎం - CM Chandrababu Naidu on Floods
సర్వశక్తులు ఒడ్డి సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రతీ ఒక్కరికీ కూడా ఇవాళ వరద సాయం అందుతోందని తెలిపారు. రోజుకు మూడు పూటలా చివరి ప్రాంతాల ప్రజలకు ఇవాళ ఆహారం అందాల్సిందేనని స్పష్టంచేశారు.
ఈ ఆదేశాలు అమలు కాకుంటే ఇక కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇళ్లలోకి పాములు, తేళ్లు వచ్చే పరిస్థితి ఉన్నందున మానవతా దృక్పథంతో అధికారులు పనిచేయాలని సీఎం సూచించారు. అధికారుల పనితీరుపై ఐవీఆర్ఎస్ కూడా నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా సక్రమంగా పని చేయకుండా ధైర్యంగా ప్రజలు చెప్పాలని అన్నారు. తానూ ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నానన్న ముఖ్యమంత్రి, ప్రజలు కూడా తోచిన విధంగా సహకరించాలని పిలుపునిచ్చారు.
ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయని, ఇటీవల కొన్ని ఘటనలు అనుమానాస్పదంగా ఉన్నాయని, బాబాయినే చంపించిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆపదలో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తారా అని ప్రశ్నించారు. ప్రకాశం బ్యారేజ్‌లో బోట్ల ఘటనపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. విపక్ష నేత ఐదు నిమిషాలు వచ్చి షో చేసి వెళ్లారని, ఒక్కరికి కూడా ఆహార పొట్లం ఇవ్వలేదని తెలిపారు. జీతం తీసుకుంటున్నప్పుడు అధికారులకు బాధ్యత ఉండదా? అని ప్రశ్నించారు. ప్రధానితో తాను మాట్లాడినప్పుడు '
'మీరు ఉన్నారు కదా.. భయం లేదని' చెప్పారని, ప్రజల స్పందన చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. హుద్‌హుద్ తుఫాను సమయంలో తన పనితీరును ప్రధాని మెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బాధల్లో ఉన్నప్పుడు బాధితుల ఆగ్రహం సహజని అన్నారు.
జలవిలయంతో అల్లాడుతున్న విజయవాడ - బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలు - Help to Vijayawada Flood Victims