Chandrababu Delhi Tour : ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చేపట్టే దిల్లీ పర్యటనల్లో నాటికి నేటికి స్పష్టమైన మార్పు కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం హోదాలో తొలి సారి దిల్లీ వెళ్లిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టులపైనే వరుస భేటీలు చేపట్టారు. ప్రధాని మోదీతో సహా తొలిరోజు ఏడుగురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహించారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్, హర్ దీప్ సింగ్, ఆర్థిక సంఘం చైర్మన్ లతో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రయోజనాలపై నివేదికలు అందచేశారు.
రెండో రోజు రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నడ్డా, నీతీ ఆయోగ్ సీఈవోలతో పాటు పలువురు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుస సమావేశాలు కొనసాగించారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ దిల్లీ పర్యటనలకు, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు వ్యత్యాసం హస్తినలో సైతం విస్తృత చర్చ జరుగుతోందని తెలుగుదేశం ఎంపీలు అంటున్నారు. నాడు తన సొంత అవసరాలు, తనపై నమోదైన కేసులు, స్వప్రయోజనాల కోసమే జగన్ దిల్లీ పర్యటనలు జరిగేవని గుర్తు చేస్తున్నారు. నేడు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులపై సహాయం కోరుతూ చంద్రబాబు వినతులు అందచేసిన తేడాను ప్రజలు కూడా గుర్తిస్తున్నారని నేతలు చెప్తున్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం వినతులతో వస్తున్న కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యం, గౌరవం కేంద్ర మంత్రుల వద్ద దక్కుతోంది. లోక్‌సభలో తెలుగుదేశం పార్టీకి బలం పెరిగినందున చంద్రబాబుకు దిల్లీలో పరపతి పెరిగిందనే వాదనా వినిపిస్తోంది. కేంద్ర పెద్దల స్పందన వేగంగా, సానుకూలంగా ఉంటోందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర మంత్రులతో పాటు వివిధ శాఖల్లో ఉన్న 60 మంది ఐఏఎస్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. గత సంప్రదాయాలకు భిన్నంగా చంద్రబాబులో వచ్చిన మార్పు, ఎంపీలకు-కేంద్ర అధికారులకు మధ్య సత్సంబంధాలు పెంచేలా వ్యవహరించిన తీరు పట్ల రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దిల్లీలో సీఎం చంద్రబాబు - నేడు ప్రధాని మోదీతో భేటీ - CM Chandrababu Delhi Tour
రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదల, ప్రాజెక్టుల మంజూరు, శాఖాపరమైన సహాయంలో చొరవ చూపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐఏఎస్‌లను స్వయంగా కోరినట్లు తెలిసింది. పార్టీకి చెందిన ఒక్కో ఎంపీ ఒకటి రెండు కీలక అంశాలపై పట్టు తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వంతోనూ, కేంద్రంతోనూ సమన్వయం చేసేలా బాధ్యతలు చంద్రబాబు అప్పగించారు. నాడు దిల్లీ పర్యటనలో హోంమంత్రి, ఆర్థిక మంత్రిని తప్ప మరెవరినీ కలవని నాటి సీఎం జగన్ తీరును, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు పట్ల దిల్లీ వర్గాల్లోనూ చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తన తొలి ప్రర్యటనలోనే ప్రతి శాఖకు సంబంధించి పెండింగ్ పనుల వివరాలతో అప్పుడే కేంద్ర మంత్రుల వెంట చంద్రబాబు పడుతున్నారనే చర్చ సర్వత్రా జరుగుతోంది.