CBN meet with CII : ‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి ఆలోచనలతో వస్తే తగిన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాజధాని అమరావతిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే స్థలాలు కేటాయిస్తాం. అమరావతిని అద్భుత నగరంగా నిర్మించేందుకు అందరి సహకారం అవసరం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రమంలో పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు కల్పిస్తాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. గురువారం సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) నేషనల్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో అనకాపల్లి జిల్లాలోని మెడ్‌టెక్ జోన్ నుంచి వర్చువల్‌గా సీఎం పాల్గొన్నారు. ‘సంక్షేమ పథకాలు పేదరికాన్ని పారదోలేవిగా ఉండాలి. ఇందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలి. గతంలోని ఆర్థిక సంస్కరణల తర్వాత ఇప్పుడు పీ4 మోడల్‌ను (పబ్లిక్, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం) తీసుకొస్తున్నాం. ఇందుకు సూక్ష్మ, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలు అమలు చేస్తాం. పేదరికం లేని దేశాన్ని ఎలా నిర్మించాలో ఆలోచిద్దాం’ అని చంద్రబాబు అన్నారు.
దేశానికి మంచి జరిగింది : ‘గతంలో సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్తు రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో రాజకీయంగా నష్టం జరిగినా దేశానికి మంచి జరిగింది. దేశంలోనే తొలిసారిగా రెగ్యులేటరీ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. ఉమ్మడి ఏపీలో ఓపెన్ స్కై పాలసీ ద్వారా హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి విమాన సౌకర్యం తీసుకొచ్చాం. తొలిసారి హైదరాబాద్‌లో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి నాందిపలికాం’ అని చంద్రబాబు తెలిపారు.
వ్యవసాయ రంగంపైనే దృష్టి : ‘వ్యవసాయరంగంపై ఆధారపడినవారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధునాతన వ్యవసాయ పద్ధతులు, డ్రోన్ సాంకేతికత వారి దరి చేరలేదు. ప్రస్తుతం నా దృష్టంతా వ్యవసాయరంగం అభివృద్ధిపైనే ఉంది. పెట్టుబడిదారులకు ఆసక్తి ఉంటే కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని చంద్రబాబు వివరించారు. ‘నైపుణ్యగణన ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉపాధి అవకాశాలపై దృష్టిపెట్టి రాష్ట్రంలోని యువతకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రంలో ఆటోమొబైల్, హార్డ్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఫార్మా, అగ్రి ప్రాసెసింగ్‌లో అవకాశాలున్నాయి. భవిష్యత్తులో హైడ్రోజన్ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులు చేపడతాం’ అన్నారు.
ఫిన్‌టెక్ హబ్‌గా విశాఖ : ‘విశాఖలో ఫిన్‌టెక్ హబ్‌ను ఏర్పాటుచేస్తే వైకాపా పాలనలో అది నామరూపాల్లేకుండా పోయింది. ఇప్పుడు లండన్, సింగపూర్ తరహాలో మరింత అద్భుతంగా విశాఖను ఫిన్‌టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. కొత్త ఆలోచనలతో రాష్ట్రానికి వస్తే కలిసి పనిచేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. అందుకు మళ్లీ మనమంతా ఈ ఏడాదే విశాఖలోనే కలుద్దాం. ఇక్కడే సీఐఐ సదస్సు పెట్టుకుందాం’ అని చంద్రబాబు అన్నారు. అమరావతిలో నిర్మించాల్సిన సీఐఐ విశ్వవిద్యాలయం గత ప్రభుత్వ విధానాల కారణంగా ముంబయికి తరలిందని, విశ్వవిద్యాలయ కేంద్రాన్ని అమరావతిలో నిర్మించేందుకు తోడ్పాటు అందించాలని సీఐఐ ప్రతినిధులు చంద్రబాబును కోరగా రెండో విశ్వవిద్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటుచేస్తే అవసరమైన స్థలం కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘మీ సంస్థల ప్రధాన కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు చేయండి. అందుకు భూములిచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విజ్ఞాన, ఆర్థిక, పబ్లిక్ పాలసీ క్రియేషన్ హబ్‌గా అమరావతి మారుతుంది’ అని చంద్రబాబు పేర్కొన్నారు.