CM Chandrababu Review on Agriculture Department: రాష్ట్రంలో విత్తనాల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో సాగవుతున్న ప్రాంతాన్ని వంద శాతం ఈ క్రాపింగ్ కింద నమోదు చేయాలని స్పష్టం చేసారు. జూలై నెలలో వరదల వల్ల ప్రభావితమైన రైతులకు 36 కోట్ల ఇన్ పుట్ సబ్సీడీని రాష్ట్ర విపత్తు నిధి నుంచి మంజూరు చేయాలని సీఎం ఆదేశించారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ప్రస్తుతం 140 డ్రోన్లు మాత్రమే వినియోగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. కరవు ప్రాంతాల్లో మాయిశ్చర్‌ను ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పరిశీలన చేసి చర్యలు చేపట్టాలన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఉద్యాన పంటల ఉత్పత్తి పెరిగేలా చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. మైక్రో ఇరిగేషన్ మాన్యుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటు పై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నిమ్మ, టమాటా, మామిడి వంటి ఉత్పత్తుల విలువ జోడించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించాలన్నారు.
పశ్చిమ బెంగాల్ మాజీ సీఎంకు సంతారం: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ మరణవార్త బాధాకరమని చంద్రబాబు అన్నారు. ఐదు దశాబ్దాలకుపైగా ప్రజా సేవ పట్ల ఆయన అంకితభావం ఎంతో స్ఫూర్తి దాయకమని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఆధునిక చరిత్రను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. భట్టాచార్య కుటుంబానికి, మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
కార్యకర్తలతో చంద్రబాబు భేటీ: టీడీపీకి నిస్వార్థంగా సేవచేస్తూ, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజుయాదవ్‌లతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సచివాలయంలోని తన ఛాంబర్‌కు వారిని పిలిపించుకొని మాట్లాడారు. గత ప్రభుత్వం చంద్రబాబును అక్రమంగా అరెస్టుచేసి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచినప్పుడు కొన్ని రోజులపాటు వారు అక్కడే ఉన్నారు. ఆయన విడుదలయ్యాక సంబరాలు చేసుకొన్నారు. వారి కుటుంబ నేపథ్యం తెలుసుకొన్న చంద్రబాబు వారితో ఫొటోలు దిగారు. చంద్రబాబు చూపిన ఆప్యాయత, సామాన్య కార్యకర్తలైన తమను గుర్తించిన తీరుతో దుర్గాదేవి, శివరాజుయాదవ్‌లు ఉబ్భితబ్బియ్యారు.
హాకీ జట్టుకు అభినందనలు: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హాకీ జట్టును సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, మంత్రి అనగాని సత్యప్రసాద్‌లు అభినందించారు. పారిస్‌లో భారత హాకీ జట్టు సాధించిన అద్భుతమైన విజయం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. మన దేశానికి ఇది బంగారు క్షణమని తెలిపారు. భారత హాకీజట్టు విజయం బంగారం కంటే ఎక్కువగా ప్రకాశిస్తోందని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ రోజు భారత పురుషుల హాకీ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో చేసిన, ప్రతి గోల్ చరిత్రలో నిలిచిపోయిందని వెల్లడించారు.
'నైపుణ్య గణనకు ఏర్పాట్లు చేయండి' - అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం - Minister Lokesh on Skill Census