Chandrababu Naidu Tribute to NTR : అసెంబ్లీకి వెళ్లేముందు అమరావతిలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాల వేశారు. చంద్రబాబుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు ఆయనకు అంజలి ఘటించారు. అంతకుముందు రాజధాని రైతులు, వెంకటపాలెం గ్రామస్థులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. జైచంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
TDP Leaders Fires on Jagan : మరోవైపు జగన్ చేసిన ఆర్థిక విధ్వంసం వల్లే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టలేకపోతున్నామని సమాచార శాఖ మంత్రి పార్థసారథి తెలిపారు. ఏ శాఖ చూసినా దోపిడీనే కనిపిస్తోందని చెప్పారు. ప్రజలకు దిక్సూచిలా త్వరలోనే పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు.
శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకే జగన్ కుట్రలు : రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించేందుకు జగన్ కుట్రలు పన్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. వాటిని ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు. 36 హత్యలు జరిగాయని అంటున్నారని, మరి వాటికి ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్సార్సీపీ వారు అంటున్నారని విమర్శించారు. పరిపాలన పక్కన పెట్టి ప్రజల్ని హింసించినందుకే 11సీట్లు వచ్చాయని, జగన్ ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహిస్తే మంచిదని ఆయన హితవుపలికారు.
ప్రభుత్వ బిల్లులు అడ్డుకోలేరు : శాసనమండలిలో ప్రభుత్వ బిల్లులు అడ్డుకోలేరని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ స్పష్టంచేశారు. ప్రజాతీర్పు తర్వాత మండలిలో జగన్ వెంట వెళ్లేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు జంకుతున్నారని చెప్పారు. ఆ పార్టీలో రాజ్యాంగాన్ని గౌరవించనవారు ఉన్నారని విమర్శించారు. తమ నాయకుడు గేట్లు తెరిస్తే ఆ పార్టీలో ఒక్క ఎమ్మెల్సీ కూడా మిగిలరని వ్యాఖ్యానించారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నారని ఆక్షేపించారు. 11 సీట్లు వచ్చిన వారికి ప్రతిపక్ష హోదా ఎలా ఉంటుదని ప్రశ్నించారు. గత ప్రభుత్వంపై తమ సర్కార్ నాలుగు శ్వేతపత్రాలు విడుదల చేసిందని వివరించారు. వాటిపై సమాధానం చెప్పే పరిస్థితి వైఎస్సార్సీపీకి లేదని అనురాధ వెల్లడించారు.
"శాసనమండలిలో ప్రభుత్వ బిల్లులు అడ్డుకోలేరు. మండలిలో జగన్ వెంట వెళ్లేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు జంకుతున్నారు. మా నాయకుడు గేట్లు తెరిస్తే వైఎస్సార్సీపీ ఒక్క ఎమ్మెల్సీ కూడా మిగలరు. 11 సీట్లు వచ్చిన వారికి ప్రతిపక్ష హోదా ఎలా ఉంటుది." - పంచుమర్తి అనురాధ, టీడీపీ ఎమ్మెల్సీ