White Paper on AP Financial Situation : 2014-19 మధ్య పెట్టుబడులకు చిరునామాగా రాష్ట్రాన్ని నిలిపామని సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని, రూ.16 లక్షల కోట్లకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని గుర్తు చేశారు. రూ.5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు. రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేశారని తెలిపారు. తలసరి అప్పు రూ.1.44లక్షలుగా ఉందని చెప్పారు. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. తమపై ప్రజల పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయబోమని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆస్తులు తాకట్టు - కేంద్రం నిధులు మళ్లింపు : ఇసుక అక్రమాల ద్వారా రాష్ట్రానికి రూ.7వేల కోట్లు, గనుల దోపిడీ ద్వారా రూ.9,750 కోట్ల నష్టం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. పోలవరం పూర్తయి ఉంటే రూ.45వేల కోట్ల ఆదాయం వచ్చేదని అన్నారు. గత ప్రభుత్వం కేంద్ర పథకాలను సరిగా వినియోగించలేదని, స్థానిక సంస్థలకు కేంద్రం కేటాయించిన నిధులను మళ్లించారని ఆరోపించారు. స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేశారని, 33 విభాగాల్లో ఉన్న రూ.4,700 కోట్లు మళ్లించారని అన్నారు.
స్పెషల్ మార్జిన్ పేరుతో రూ.20,676 కోట్లు ఏపీ ఎస్‌బీసీఎల్‌కు మళ్లించారని తెలిపారు. ఏఆర్‌ఈటీ పెట్టి రూ.14,275 కోట్లు మళ్లించారని, 15 ఏళ్ల ఆదాయం మళ్లించేందుకు ఏఆర్‌ఈటీ పెట్టారని అన్నారు. విశాఖపట్నంలో రూ.1,942 కోట్ల విలువైన ఆస్తులు తాకట్టు పెట్టారని, దాదాపు రూ.40వేల కోట్ల విలువైన ఆస్తులను కబ్జా చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల నుంచి రూ.3,142 కోట్లు, డిస్కంల నుంచి రూ.2,66 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల సేవింగ్స్ రూ.5,243 కోట్లు మళ్లించారని చంద్రబాబు వివరించారు.
అసెంబ్లీ నిరవధిక వాయిదా- వైసీపీ విధ్వంస పాలనపై మూడు శ్వేత పత్రాలు - Assembly Sessions End
అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తాం : న్యూ ఎపిక్ సెంటర్ ద్వారా అమరావతి అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. గత అభివృద్ధి కొనసాగితే ఏఐకి రాజధాని నిలయంగా మారేదని, అమరావతికి 30వేల మంది రైతులు 34,400 ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. రాజధానిలో అభివృద్ధి కొనసాగి ఉంటే రూ.3లక్షల కోట్ల ఆస్తి, 7 లక్షల ఉద్యోగాలు వచ్చేవని అన్నారు. అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చరు.
గతంలో పరిశ్రమల ద్వారా 7.72లక్షల ఉద్యోగాలు సృష్టించామని గుర్తు చేశారు. వేగంగా అభివృద్ధి చెందే రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలిచామని, తలసరి ఆదాయం 13.2 శాతానికి తీసుకురాగలిగామని, గత ఐదేళ్లలో వ్యవసాయంలో వృద్ధి రేటు 5.7 శాతం, సేవల రంగంలో 2 శాతం తగ్గిందని అన్నారు. వృద్ధి రేటు 13.5 నుంచి 10.5 శాతానికి పడిపోయిందని, దీంతో జీఎస్‌డీపీ కంట్రిబ్యూషన్ రూ.6.94 లక్షల కోట్లు తగ్గిందని, రాష్ట్రానికి వచ్చే ఆదాయం కూడా రూ.76,195 కోట్లు తగ్గిపోయిందని తెలిపారు.
2021 నాటికి పోలవరం పూర్తయ్యేది : పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు సాగు నీరందుతుదని, రూ.1667 కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశామని సీఎం అన్నారు పట్టిసీమ పూర్తి చేయడం వల్ల రూ.44 వేల కోట్ల ఆదాయం వచ్చింది. నాకు పేరొస్తుందని వైఎస్సార్సీపీ పాలనలో పట్టిసీమను కూడా సరిగా నిర్వహించలేదని ఆరోపించారు. విజయవాడ, రాజమహేంద్రవరం, తిరుపతి, కడప విమానాశ్రయాలు అభివృద్ధి చేశామని, రాష్ట్రంలో 8 లక్షల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చామని, విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేశామని గుర్తు చేశారు.
ఎన్ని ఇబ్బందులున్నా గతంలో సంక్షేమానికి బడ్జెట్‌లో 34 శాతం ఖర్చు చేశామని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ.11,762 కోట్లు కేటాయించామని, టీడీపీ అధికారంలో కొనసాగి ఉంటే 2021 నాటికి పోలవరం పూర్తయ్యేదని అన్నారు. పోలవరంపై కేంద్రం నిపుణుల కమిటీ వేసిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుకు ఇబ్బందులు లేకుండా ఉండాలంటే కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని వారు సూచించారు. ఇప్పుడు రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్ కట్టాల్సిన పరిస్థితి అని అన్నారు.
అన్ని హామీలు అమలు చేస్తాం : ప్రజల జీవన ప్రమాణాలను ఏవిధంగా పెంచాలనేది ఆలోచిద్దామని సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు. ప్రపంచంలోని ఉత్తమ విధానాలను అవలంబిద్దామని, వినూత్నమైన విధానాలతో రాష్ట్రాన్ని బాగుచేద్దామని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్‌లోని అన్ని హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వ సాయం ఇటు మనం కూడా కష్టపడి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ముందుకెళ్లాలని సూచించారు. గత పాలకులు రాష్ట్రానికి ఎంత అన్యాయం చేశారో ప్రజలకు తెలియాలని తెలిపారు. అందుకే శ్వేతపత్రాలు విడుదల చేశామని అన్నారు. ఏపీని మళ్లీ రీబిల్డ్ చేయాలని అన్నారు. ప్రజలు పెట్టిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా మనమంతా అనునిత్యం పని చేయాలని కోరారు.