CM Chandrababu Naidu on Floods: విజయవాడలోని పలు కాలనీల్లో పర్యటించిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు. వరదలో చివరి ప్రాంతాలకు సహాయం అందించలేకపోవటం బాధగా ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు, ధనికులు, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ దీనావస్థలో ఉన్నారని ఆయన బాధను వ్యక్తం చేశారు. ఒకవైపు వరద నీటిని నియంత్రించే చర్యలను చేపడుతూనే మరోవైపు చివరి ముంపు బాధితులకు ఎక్కడికక్కడ సహాయం అందించే కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రాణనష్టం తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద: ఎంత ప్రయత్నించినా చివరి ప్రాంతాలకు సహాయం అందివ్వలేకపోయామన్నారు. గత 5ఏళ్లలో గండి పూడ్చే పనులు జరగకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు వరద నమోదైందని వివరించారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు 11.95లక్షల క్యూసెక్కులకు తగ్గట్టు డిజైన్ చేస్తే, 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావటం చరిత్రలో ఎప్పుడూ లేదని చెప్పారు. ఎక్కడా నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధితులందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు. బాధితులందరినీ ఆదుకున్నాకే కలెక్టరేట్ నుంచి కదులుతామని స్పష్టం చేశారు.
'ప్రాణాలతో బయట పడతామనుకోలేదు' - చంద్రబాబు వద్ద బాధితుల ఆవేదన - Chandrababu Talk To Flooded People
జగన్‌కు రాష్ట్రం పట్ల బాధ్యత లేదు: అజ్ఞానం, విచ్చలవిడి తన ఇంటిని కాపాడేందుకు బుడమేరుకు నీరు పంపించానని జగన్ మాట్లాడారని మండిపడ్డారు. జగన్‌కు రాష్ట్రం పట్ల బాధ్యత లేకపోవచ్చు కానీ తనకు పూర్తిస్థాయి బాధ్యత ఉందని స్పష్టం చేశారు. విజయవాడ జల విలయం నుంచి కోలుకునేందుకు కేంద్రం సాయం తప్పనిసరన్న చంద్రబాబు, అందుకే వెంటనే ప్రధాని, హోంమంత్రితో మాట్లాడి పరిస్థితిని వివరించానని చెప్పారు. ప్రస్తుత విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరతామని తెలిపారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో అన్ని వివరాలతో కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు.
"నా రాజకీయ జీవితంలో చూసిన అతి పెద్ద విపత్తు ఇది. ఇంతకుముందు హుద్‌హుద్, హరికేన్, తిత్లీ వంటి విపత్తులని ఎదుర్కొన్నాం. వాటితో పోల్చితే ఇక్కడ ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. ఆస్తి నష్టం భారీగా సంభవించింది. అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతున్నాం. అన్ని వివరాలు కేంద్రానికి పంపుతాం. ప్రజలని ఈ విపత్తు నుంచి బయట పడేసేందుకు, జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు, వీలైనంత ఎక్కువ సాయం చేయాలని అభ్యర్థిస్తాం". - చంద్రబాబు, సీఎం
వరద బాధితులకు పటిష్ట సహాయ చర్యలు - డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ - first time used drones in ap
ప్రతిదీ రాజకీయం చేయడమేనా: ప్రకాశం బ్యారేజీని 2బోట్లు వచ్చి ఢీ కొనటం ప్రమాదవశాత్తు జరిగిందే కావొచ్చని, కానీ వివేకాను హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించిన వారు ఇలాంటి పనేందుకు చేయరనే అనుమానం ఉందన్నారు. గుడ్లవల్లేరు కళాశాల విషయంలో వైకాపా తీరుపై ధ్వజమెత్తిన చంద్రబాబు, ప్రతిదీ రాజకీయం చేయడమేనా అని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి గుత్తికొండ శ్రీనివాస్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు. గుత్తికొండ శ్రీనివాస్‌ను సీఎం అభినందించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు పడుతున్న శ్రమ చూసి తన వంతు సాయం ఇచ్చానని గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు
ఏపీలో వర్ష బీభత్సం - 19 మంది మృతి - ఇద్దరు గల్లంతు: ప్రభుత్వం వెల్లడి - Heavy Rains and Floods in AP