CM Chandrababu Comments at World Tribal Day: ఆదివాసీలంటే శౌర్యం, సహజ ప్రతిభ, నైపుణ్యం కలిగిన వ్యక్తులు అని, అన్ని రంగాల్లో గిరిజనులు ముందుండాలనేదే తమ ఆకాంక్ష అని ఆదివాసీలతో జరిగిన ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివాసీ దినోత్సవానికి (World Adivasi Day) సీఎం చంద్రబాబు హాజరయ్యారు. చంద్రబాబుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.
గిరిజనులకు అనేక సంప్రదాయాలు, కళలు ఉన్నాయని, ఇంకా గిరిజనులు వెనకబడే ఉన్నారన్నారు. ఆదివాసీ దినోత్సవం జరుపుకోవాలని తామే జీవో నెం.127 జారీచేశామని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ఆదివాసీ దినోత్సవం జరిపామన్నారు. గత ఐదేళ్లలో ఆదివాసీ దినోత్సవాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాగలిగారని కొనియాడారు. అంచెలంచెలుగా ఎదిగి దేశానికి అధ్యక్షురాలుగా మారారంటే ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
అల్లూరి సీతారామరాజు, ఏకలవ్యుడిని ఆదివాసీలు ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో 5.53 శాతం మంది ఆదివాసీలు, దేశవ్యాప్తంగా 10 కోట్ల 42 లక్షల మంది గిరిజనులు ఉన్నారన్నారు. ఆఫ్రికా తర్వాత ప్రపంచంలో రెండో స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారత్ అని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 27 లక్షల 39 వేల మంది ఆదివాసీలు ఉన్నారని పేర్కొన్నారు.
ఆదివాసీ దినోత్సవం - గిరిజనులతో కలిసి చంద్రబాబు థింసా నృత్యం - CM CBN at Tribal Day Celebrations
గిరిజనులు ఉత్పత్తులకు బ్రాండ్ తీసుకొచ్చాం: సమైక్యాంధ్రప్రదేశ్‌లో 'చైతన్యం' అనే కార్యక్రమం తీసుకొచ్చామన్న సీఎం, దీని ద్వారా గిరిజనుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చామని గుర్తు చేశారు. మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రధాని వచ్చినప్పుడు అరకు కాఫీ ఇచ్చి తాగించామన్న చంద్రబాబు, మంచి వస్తువును తయారు చేయడమే కాదని, పది మందికి తెలియాలన్నారు. గిరిజనులు ఉత్పత్తులను పదిమందికి పరిచయం చేసి, బ్రాండ్ తీసుకొచ్చామన్నారు.
ఆదివాసీల ఆదాయం చాలా తక్కువగా ఉందన్న సీఎం చంద్రబాబు, అన్నిరకాలుగా పైకి వచ్చేవరకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఎస్టీల కోసం తెచ్చిన అనేక పథకాలను గత ప్రభుత్వం తీసేసిందని విమర్శించారు.
సమావేశానికి హాజరైన చంద్రబాబుకు గిరిజన సాంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేశారు. గిరిజనులతో కలిసి డప్పు కొట్టి వారిలో ఉత్సాహం నింపారు.