CM Chandrababu Meeting with TDP Leaders: ప్రభుత్వపరంగా ప్రజలకు వాస్తవాలు చెప్పేలోపు వైఎస్సార్సీపీ నేతల ద్వారా జగన్ అబద్దాలు వ్యాప్తి చెందేలా కుట్రలు చేస్తున్నరని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. డిక్లరేషన్‌పై సంతకం చేయటం ఇష్టం లేక తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్ ప్రభుత్వమేదో తనని అడ్డుకున్నట్లుగా చేసిన అసత్య ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టినట్లే భవిష్యత్తు పరిణామాల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో అందుబాటులో ఉన్న నేతలతో సీఎం సమావేశమయ్యారు.
అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసుల, అధికారులు తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులు వైఎస్సార్సీపీ నేతలు అంటూనే రాజకీయ ప్రమేయం లేదనే భిన్నాభిప్రాయాలు పోలీసులు వ్యక్తం చేయటాన్ని నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. పోలీసులు విచారణ పూర్తి చేయకుండా రాజకీయ ప్రమేయం లేదనడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు. భవిష్యత్తు ఘటనలపై అప్రమత్తంగా ఉంటూ పొరపాట్లు దొర్లకుండా చూసుకుందామని నేతలతో సీఎం అన్నట్లు తెలుస్తుంది.
ఓపిగ్గా వినతులు స్వీకరణ: ఎన్టీఆర్ భవన్‌కు వచ్చిన సీఎం చంద్రబాబుకు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. ఓపిగ్గా అందరి నుంచి వాటిని స్వయంగా స్వీకరించిన సీఎం పరిష్కారానికి హామీ ఇచ్చారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం 10వేల రూపాయలు విరాళం ఇచ్చిన ఓ దివ్యాంగురాలిని సీఎం అభినందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో హత్యకు గురైన తన కుమారుడి కేసును అప్పటి విజయవాడ సీపీ క్రాంతీ రాణా తాతా, డీసీపీ విశాల్ గున్నీ తదితరులు నీరుగార్చారని ఓ బాధితురాలు సీఎంను కలిసి ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ హయాంలో విద్యుత్ బిల్లు ఎక్కువగా వచ్చిందనే కారణంతో ఫించన్ నిలుపుదల చేశారనే ఫిర్యాదులను ఎక్కువ మంది బాధితులు సీఎంకి అందచేశారు.
నేరుగా సీఎం వద్దకే: ప్రజల నుంచి సీఎంకి వస్తున్న వినతుల్ని అధ్యయనం చేసేందుకు సీఎం ముఖ్యకార్యదర్శి ఏవీ రాజమౌళి నేతృత్వంలోని బృందం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చింది. ప్రజల నుంచి సీఎంకు ఎలాంటి వినతులు వస్తున్నాయి, వాటి సత్వర పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, తదితర అంశాలపై పరిశీలన జరిపారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేకి ఫిర్యాదు ఇవ్వకుండా నేరుగా సీఎం వద్దకే వస్తున్నారంటే సీఎంకు అందే ఫిర్యాదు సత్వరం పరిష్కారమవుతుందనే నమ్మకంతోనే కాబట్టి. ఆ దిశగా పరిష్కార చర్యలు ఉండాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
పార్టీ కార్యాలయంలో వచ్చే వినతుల్లో 40శాతం రాజకీయ అంశాలు, నామినేటడ్ పదవుల దరఖాస్తులు కాగా మిగిలిన 60శాతం ప్రజా సమస్యలే ఉంటున్నాయని సీఎం కార్యాలయం గుర్తించినట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా రెవెన్యూ అంశాలే ఉన్నందున ఒకే తరహా సమస్య ఉంటే వాటి పరిష్కారానికి అవసరమైతే చట్ట సవరణకూడా చేసే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
కొలికిపూడిపై మీడియా ప్రతినిధులు ఫిర్యాదు: తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌పై సీఎం చంద్రబాబుకు మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మీడియా ప్రతినిధులందరినీ కించపరిచేలా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని తెలిపారు. కొలికిపూడి తమను బెదిరిస్తూ కించపరిచిన ఆధారాలను మీడియా ప్రతినిధులు సీఎంకు అందచేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు అన్ని విషయాలు తెలుసన్న సీఎం సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మిణుకు మిణుకు జీవితాలు - రెచ్చిపోతున్న ముఠాలు - మారని తీరు - Unlit Street Lights In Visakha