Chandrababu Video Message to Macherla Activists: పసుపు జెండాని నిలబెట్టడం కోసం పల్నాడులో తెలుగుదేశం కార్యకర్తలు చేసిన త్యాగాలను తాను మరచిపోలేనని పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రతికూల వాతావరణంతో చంద్రబాబు మాచర్ల సభ రద్దవడంతో వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన వీడియో సందేశం పంపారు. పల్నాడులో కార్యకర్తలు చేసిన ప్రాణ త్యాగాలు తనకు ఎప్పుడూ అనునిత్యం గుర్తు చేస్తూనే ఉంటాయని చెప్పారు. పల్నాటి పౌరుషాన్ని చాటి కూటమి అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు. పౌరుషాల గడ్డ పల్నాడు ప్రజల ఐదేళ్ల నరకంపై ఉన్న ఆవేదన కసి తనకు తెలుసన్న చంద్రబాబు దెబ్బ కొట్టాలని ఆవేశంతో ప్రతి ఒక్కరిలోనూ తిరుగుబాటు కనిపిస్తోందన్నారు.
పల్నాడులో ప్రాణం త్యాగం చేసిన కార్యకర్తలు చంద్రయ్య, జల్లయ్య లాంటి కార్యకర్తలకు ఘన నివాళులర్పిస్తున్నట్లు వెల్లడించారు. మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అనమన్నా ప్రాణంలో ఊపిరి ఉన్నంతవరకు ఆ మాట అననని జై చంద్రబాబు జై తెలుగుదేశం అంటూ చంద్రయ్య ప్రాణాలర్పించారని చెప్పారు. వైఎస్సార్సీపీ రౌడీలు పల్నాడు ప్రాంతంలో 30 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ప్రాణాలు పోయినా, ఎత్తిన జెండా దించకుండా కుటుంబాలకు కుటుంబాలు పార్టీని కాపాడుకుంటూ వచ్చారని కొనియాడారు. వైఎస్సార్సీపీ రౌడీ మూకలను తరిమేందుకు మంచి అభ్యర్థిని మాచర్లలో నిలబెట్టానని పేర్కొన్నారు.
వాతావరణం అనుకూలించక తాను మాచర్లలో ప్రచారానికి రాలేకపోయానని తనకెంతో బాధ కలిగిందని, తన మనసంతా మాచర్ల మీదే ఉందని వివరించారు. ఎన్నికల ముందు మాచర్ల వచ్చి ప్రజలందరికీ నమ్మకం ఇవ్వాలని అనుకున్నానని చెప్పారు. మాచర్లలో క్యాడర్ మొత్తాన్ని కాపాడుకునేందుకు భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని అనుకున్నానన్నారు. గెలుపే ధ్యేయంగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి దూసుకుపోతున్నారని అభినందించారు. వందకి వెయ్యి శాతం బ్రహ్మానందరెడ్డి గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలని గెలిపించాలని కోరారు. ఐదేళ్లుగా నరకం అనుభవించిన తెలుగుదేశం కార్యకర్తలకు విముక్తి లభించనుందని పల్నాటి పౌరుషాన్ని ఎన్నికల్లో చూపించాలని ఆయన పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ రౌడీ మూకలను తరిమేందుకు బ్రహ్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.