Chandrababu on Palnadu District Clashes : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో పల్నాడులో జరుగుతున్న హింసపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మాచర్లలో ఇప్పటికీ దాడులు జరగడం పోలీసుల వైఫల్యమేనని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడటంలో పోలీసు అధికారులు విఫలం అయ్యారని చంద్రబాబు విమర్శించారు. ఉదయం నుంచి పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫిర్యాదులు చేస్తున్నా, శాంతి భద్రతలు కాపాడలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ వెంటనే ఈ ప్రాంతంలో పోలింగ్‌పై సమీక్షించి, పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.
దెబ్బకు దెబ్బ - ఓటరును కొట్టిన ఎమ్మెల్యే - తిరిగి చెంప చెల్లుమనిపించిన ఓటర్ - VOTER SLAPS MLA IN AP
వరుస హింసాత్మక ఘటనలు: కాగా పల్నాడు జిల్లా మాచర్లలో ఉదయం నుంచి వరుసగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మాచర్ల 216, 205, 206, 207 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో పోలింగ్ నిలిపివేసి భయంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అదే విధంగా మాచర్ల నియోజకవర్గం రెంటాలలో టీడీపీ అభ్యర్థి వాహనంపై వైఎస్సార్సీపీ మూకలు దాడి చేశాయి. రెంటాలలో పోలింగ్ సరళిని చూసేందుకు వెళ్లిన జూలకంటి బ్రహ్మానందరెడ్డి వాహనంపై వైఎస్సార్సీపీ మూకలు రాళ్లు విసిరారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
మాచర్ల నియోజకవర్గం తుమ్మరకోటలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇరువర్గాల ఘర్షణలో తుమ్మరకోటలో 10 బైకులు ధ్వంసం అయ్యాయి. తుమ్మరకోటలోని పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం చేశారు. పోలింగ్ నిలిచిపోవడంతో, ఘటనాస్థలికి ఐజీ శ్రీకాంత్, ఎస్పీ బిందుమాధవ్ చేరుకుని పరిశీలించారు.
లావు శ్రీకృష్ణదేవరాయలు వాహనాలపై దాడి: పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం దొండపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వాహనాలపై వైఎస్సార్సీపీ మూకలు దాడికి పాల్పడ్డారు. మూడు వాహనాలు ధ్వంసం చేశారు.