Chandrababu Met With Constituency Incharges: ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. లోపాలుంటే సరిదిద్దుకోమని దిశానిర్దేశం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇన్‌ఛార్జ్‌ల పనితీరు పై వివిధ సర్వేలలో సేకరించిన ప్రజాభిప్రాయాన్ని వారి ముందు పెట్టి లోటుపాట్ల పై హితబోధ చేస్తున్నారు. కొందరు ఎంపిక చేసిన ఇన్‌ఛార్జుల్ని ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించి మాట్లాడుతున్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములే- వాలంటీర్లకు మేం వ్యతిరేకం కాదు : చంద్రబాబు
చంద్రబాబు తన నివాసంలో నిన్న సుమారు 10 మందితో మాట్లాడారు. ఒక్కొక్కరికి కనీసం 10-15 నిమిషాల సమయం కేటాయిస్తున్నారు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు సమావేశాలు జరిగాయి. రోజుకు మొత్తం 25 మంది వరకు పిలిచి మాట్లాడాలని ఆయన నిర్ణయించారు. తొలిరోజు చంద్రబాబుతో సమావేశమైనవారిలో పెందుర్తి ఇన్‌ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి , రాజాం ఇన్‌ఛార్జ్ కోండ్రు మురళి , పీలేరు ఇన్‌ఛార్జ్ నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి , రాప్తాడు ఇన్‌ఛార్జ్ పరిటాల సునీత, శ్రీశైలం ఇన్‌ఛార్జ్ బుడ్డా రాజశేఖర్‌రెడ్డి , దెందులూరు ఇన్‌ఛార్జ్ చింతమనేని ప్రభాకర్ , మైదుకూరు ఇన్‌ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ , పామర్రు ఇన్‌ఛార్జ్ వర్ల కుమార్ రాజా తో పాటు మరో రెండు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు ఉన్నారు.
స్మగ్లర్లు, గూండాలకు సీఎం జగన్ ప్రాధాన్యమిస్తుంటే వారు పోలీసులను లెక్కచేస్తారా?: చంద్రబాబు
పరిటాల సునీత వెంట ఆమె కుమారుడు శ్రీరామ్, వర్ల కుమార్ రాజా వెంట ఆయన తండ్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య చంద్రబాబును కలిశారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జుల పనితీరుపై వివిధ సర్వేల్లో ప్రజాభిప్రాయం ఎలా ఉంది పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని వారు ఎలా నిర్వహించారు ఎక్కడ వెనుకబడి ఉన్నారు సరిదిద్దుకోవాల్సిన లోపాలేంటి నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఎవరితోనైనా విభేదాలున్నాయా వంటి అంశాలపై చంద్రబాబు వారికి వివరించారు.
ఎన్నికలకు ఎంతో సమయం లేదని, చిన్న చిన్న లోపాలుంటే వెంటనే సరిదిద్దుకుని పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని వారికి సూచించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్‌లు వారివేనని చంద్రబాబు నేరుగా చెప్పకపోయినా దాదాపుగా టికెట్‌లు ఖాయమైనవారినే తొలి దశలో పిలిచి మాట్లాడుతున్నారన్న అభిప్రాయం పార్టీ నాయకుల్లోనూ, ఆయనతో సమావేశమైన ఇన్‌ఛార్జుల్లోనూ వ్యక్తమవుతోంది. నేడు కూడా మరికొందరిని పిలిచి మాట్లాడాల్సి ఉండగా, చంద్రబాబు దిల్లీ వెళుతున్నందున ఆ సమావేశాల్ని వాయిదా వేసినట్లు సమాచారం.
చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం - అభ్యర్థిని నిలిపే అంశంపై సందర్భానుసారం నిర్ణయం
మొదటి రోజు చంద్రబాబు ఆయన నివాసంలో పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగగా, దానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. నేటి నుంచి జరగనున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైనా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడంపైనా చర్చ జరిగింది.