Chandrababu Meeting with Amit Shah and JP Nadda: తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. రాత్రి 11.25 గంటల సమయంలో అమిత్‌షా నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అక్కడే ముగ్గురూ సమావేశమయ్యారు. ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు ప్రకటించి ఎన్నికల రంగంలో దిగుతున్న నేపథ్యంలో బీజేపీ పెద్దలు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. నడ్డా, షాలతో రాత్రి ఏడున్నరకు భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే రాత్రి పొద్దుపోయేవరకూ పార్లమెంటు ఉభయసభలు సాగడంతో వారిద్దరూ పార్లమెంటులోనే ఉండిపోయారు. దాంతో రాత్రి 11.25 గంటలకు చంద్రబాబు వారితో సమావేశం అయ్యారు. 40 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. అయితే చంద్రబాబు కన్నా 10 నిమిషాల ముందే జేపీ నడ్డా అమిత్ షా నివాసం నుంచి వెళ్లిపోయారు. తర్వాత చంద్రబాబు షా నివాసం నుంచి వెళ్లిపోయారు.
స్మగ్లర్లు, గూండాలకు సీఎం జగన్ ప్రాధాన్యమిస్తుంటే వారు పోలీసులను లెక్కచేస్తారా?: చంద్రబాబు
బీజేపీ నాయకత్వం ఎన్డీఏ పూర్వ భాగస్వాములన్నింటినీ తిరిగి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం అధినేత వారితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఇటీవల ఎన్డీఏ కూటమిలోకి వచ్చిన బిహార్ మాజీ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు షా, నడ్డాలతో భేటీ అయ్యారు. తర్వాత కమలనాథులు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అంతకుముందు దిల్లీకి చేరుకున్న చంద్రబాబుకు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, రామ్మోహన్‌నాయుడు, రఘురామకృష్ణరాజు స్వాగతం పలికారు. తర్వాత ఆయన హోటల్‌కు వెళ్లి కొంతసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి గల్లా ఇంటికి చేరుకుని పార్టీ ఎంపీలు, ఇతరులతో ఇష్టాగోష్ఠిగా భేటీ అయ్యారు.
నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో చంద్రబాబు భేటీ - లోపాలను సరిదిద్దుకోవాలని సూచన
చంద్రబాబును కలిసిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు బుధవారం రాత్రి దిల్లీలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన ఇప్పటివరకూ తెలుగుదేశంలో అధికారికంగా చేరకున్నా ఇలా వచ్చి కలవడం ప్రాధాన్యం సంతరించుకొంది. తెలుగుదేశం ఎంపీలతో పాటు ఆయన కూడా చంద్రబాబుతో జరిగిన ఇష్టాగోష్టి చర్చల్లో పాల్గొన్నారు.
బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్‌తో ప్రతి కుటుంబానికి 8లక్షల నష్టం: చంద్రబాబు
రాజకీయ వర్గాల్లో చర్చ: చంద్రబాబు దిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చలు మొదలయ్యాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. వీరితో పాటు బీజేపీ కూడా పొత్తులో చేరే అవకాశం ఉందని, చంద్రబాబు పర్యటన అందుకే అని చర్చ జరుగుతోంది. పొత్తు కోసమే బీజేపీ నేతలతో చంద్రబాబు దిల్లీ వెళ్తున్నట్లు నేతలు చర్చించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. సీట్ల సర్దుబాటుపై కూలంకుషంగా చర్చించారు. దీంతో ఈ భేటీలో పొత్తులపై ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గురువారం మరో సారి వీరు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఇరు పార్టీల నుంచి సీట్ల సర్థుబాటు, ఉమ్మడి మ్యానిఫెస్టో, బహిరంగ సభలపై స్పష్టత ఇవ్వనున్నట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అమిత్‌షాతో చంద్రబాబు భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది.