Chandrababu Letter to AP CS on Human Trafficking: రాష్ట్రంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వం దృష్టి సారించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఏపీకి చెందిన వందలాది మంది యువకులు కాంబోడియాలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నకిలీ ఏజన్సీలు యువతను మోసం చేశాయని తెలిపారు.
ఈ వ్యవహారం ఎన్ఐఏ విచారణలో బయటపడిందని పేర్కొన్నారు. బాధిత యువతను రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. కాంబోడియా, లావోస్, ఇతర ప్రాంతాల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధిత యువత గమ్యస్థానాలకు చేరుకుంటోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి వీలైనంత త్వరగా బాధితులను తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదే విషయమై, తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి సహాయపడాలంటూ విదేశాంగ మంత్రి జై శంకర్‌ను సైతం చంద్రబాబు ఎక్స్ ద్వారా కోరారు. మానవ అక్రమ రవాణాకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారడం తీవ్ర ఆందోళనకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కాంబోడియాలో చిక్కుకున్న 150 మంది తెలుగువారిని స్వదేశానికి తీసుకురావడానికి సహాయపడాలని కోరారు. ఉద్యోగాల పేరుతో రాష్ట్ర యువతను అక్రమంగా కాంబోడియా తరలించి సైబర్ క్రైమ్ ఉచ్చులోకి నెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను మోసం చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్న నకిలీ ఏజెంట్లపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Cambodia Job Scam: కాగా కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను ఏజెంట్లు నమ్మించారు. ఒక్కొక్కరి నుంచి రూ.1.5 లక్షల చొప్పున వసూలు చేశారు. అనంతరం చైనా, కాంబోడియా కంపెనీలకు చెందిన ఏజెంట్లకు వారిని అప్పగించారు. భారతీయులే లక్ష్యంగా సైబర్ నేరాలకు పాల్పడటంపై బాధితులకు శిక్షణ సైతం ఇచ్చారు. ఎవరైనా తిరస్కరించినా, ఎదురుతిరిగినా చిత్రహింసలకు గురిచేశారు. ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో మానవ అక్రమ రవాణా విషయం వెలుగులోకి వచ్చింది. వీరివద్ద కొందరు ఏడాదిగా, మరొకొందరు ఆరు నెలలుగా కాంబోడియాలో పనిచేస్తున్నారు. చైనా ఏజెంట్ల వలలో దేశవ్యాప్తంగా 5 వేల మంది చిక్కుకున్నట్లు అంచనా. ఇప్పటివరకు రాష్ట్రానికి చెందిన 150 మందిని గుర్తించారు.
బేస్‌బాల్ బ్యాట్లతో కొట్టే: ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉండేవారే లక్ష్యంగా సైబర్ మోసాలకు తెగబడ్డారు. తెలుగు వచ్చిన వారు ఆ భాష వారిని లక్ష్యంగా చేసుకోవాలని యువకులపై ఏజెంట్లు ఒత్తిడి చేసేవారు. నేరాలు చేయలేమని ఎవరైనా అంటే చీకటి గదుల్లో బంధించేవారు. భోజనం పెట్టకుండా తీవ్రంగా హింసించేవారు. బేస్‌బాల్ బ్యాట్లతో కొట్టేవారు. పనితీరు సరిగా లేనివారికి, టార్గెట్ రీచ్ అవ్వని వారికి ఒక పూట మాత్రమే భోజనం పెట్టేవారు. ఎక్కువ మందిని మోసగించిన వారికి రెండు పూటలా భోజనం పెట్టేవారు. తాజాగా ఇదే విషయమై చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. యువకులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని కోరుతూ సీఎస్‌కి లేఖ రాశారు.
'యూ ఆర్ అండర్ డిజిటల్ అరెస్ట్' - అంటే నమ్మకండి! - cyber crimes in AP