Chandrababu Fire on CM Jagan in Prajagalam Sabha: రాయలసీమలో 102 ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేదని కర్నూలు జిల్లా కౌతాళంలో నిర్వహించిన ప్రజాగళం సభలో మండిపడ్డారు. స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చి వాటికి పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నేతలు తుంగభద్ర పరిసరాల నుంచి ఇసుక, మట్టి దోపిడీ చేస్తున్నారన్న చంద్రబాబు అవినీతి పనులు చేసి సంపాదించిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు.
జగన్ ప్యాలెస్ కొల్లగొడితే పేదల పొట్ట నిండుతుందని చంద్రబాబు అన్నారు. సామాజిక సమీకరణల ప్రకారం కర్నూలు జిల్లాలో టికెట్లు ఇచ్చామన్నారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఎన్నికల్లో ఎన్డీయే కూటమి కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేసిన దుర్మార్గుడు సీఎం జగన్ అని మండిపడ్డారు. ఆర్డీఎస్ ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు జీవుల రక్తం తాగే వ్యక్తులు బాలనాగిరెడ్డి, సాయిప్రతాప్‌రెడ్డి అని అన్నారు. సీఎం జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు చేసేవన్నీ మోసాలే అని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇవ్వకుండా జే బ్రాండ్ మద్యం, గంజాయి ఇచ్చారని చంద్రబాబు అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని స్థాపించాక తొలి సంతకం డీఎస్సీపైనే పెడతామని అన్నారు. ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు తాగునీరు ఎక్కడ ఉంటే అక్కడి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని పక్కనే తుంగభద్ర నది ఉన్నా ఈ ప్రాంత ప్రజలకు తాగడానికి నీళ్లు లేవు వ్యాఖ్యానించారు. జగన్‌ను నమ్మి రాయలసీమ ప్రజలు మోసపోయారని దుయ్యబట్టారు. ఎన్డీయే కూటమి వల్లే మంత్రాలయం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు.
వైసీపీ పాలనలో ముస్లింలపై ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు తప్ప వారికి పనికొచ్చే ఏపనీ చేయలేదని మైనార్టీలను జగన్ అణచివేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లాం బ్యాంక్ అంటూ మభ్యపెట్టారన్నారు. మతాల మధ్య వైసీపీ చిచ్చుపెడుతోందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేసుల మాఫీ కోసం జగన్ వారికి సాగిలపడుతున్నారని విమర్శలు గుప్పించారు. కూటమి అధికారంలోకి రాగానే విదేశీ విద్య, రంజాన్ తోఫా అందిస్తామని భరోసా ఇచ్చారు.