Chandrababu and Pawan Kalyan Public Meeting in Nellore: జరగబోయే ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని నెల్లూరులో జరిగిన కూటమి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం సైకోను సాగనంపాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నెల్లూరులోని నర్తకి సెంటర్‌లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇవి ధర్మానికి-అధర్మానికి, విధ్వంసానికి-అభివృద్ధికి, బందిపోటుకు - ఐదు కోట్ల మంది ప్రజలకు మధ్య జరిగే ఎన్నికలని పేర్కొన్నారు. రాతియుగం పోయి స్వర్ణయుగం రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ సైకో జగన్ అధికారంలో ఉంటే ప్రజలకు భవిష్యత్ లేదని, తమ ఆస్తులకు భద్రత లేదని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోని రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.
తొలి సంతకం మెగా డీఎస్సీపైనే: జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారని దీని ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం ఉండదని, దస్తావేజులు ఉండవని చంద్రబాబు అన్నారు. భూముల రికార్డులన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయి ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్ అనుమతి కావాలని అన్నారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని హామీ ఇచ్చారు. రెండో సంతకం ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దుపై చేస్తానని తెలిపారు. ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్ తీసుకొస్తామని వారి కోసం హజ్‌హౌస్ నిర్మిస్తామని అన్నారు. ముస్లిం సోదరులకు మక్కా యాత్రలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. మౌజమ్, ఇమామ్‌లకు గౌరవ వేతనం పెంచుతామని ఐదేళ్లలో యుతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
రైతును రాజుగా చేస్తాం: నెల్లూరు-తిరుపతి-చెన్నైని ట్రైసిటీగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అంతే కాకుండా ఈ ప్రాంతాన్ని హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్ హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక 48 వేల ఇళ్లు అర్హులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా రైతును రాజుగా చేసి ఏటా రూ.20 వేలు ఇస్తామని తెలిపారు. ఏప్రిల్ నుంచి సామాజిక పింఛన్లు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్లు అందజేస్తాంమని హామీ ఇచ్చారు. పెన్షన్ల పంపిణి విషయంలో జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు.
Pawan Kalyan Speech: ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రజలు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అన్నారు. ఇప్పడున్న పరిస్థితులలో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలని తెలిపారు. అందరం కలిసి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకుందామని కోరారు. ప్రజల భవిష్యత్తుకు మనస్ఫూర్తిగా అండగా ఉంటామని అన్నారు. యువత గొంతెత్తితే దేశపు జెండాకు ఉన్న శక్తి ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.