Kishan Reddy on BJP Membership in Telangana : ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని కేంద్రమంత్రి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీగా బీజేపీ గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిందని, 2024 సభ్యత్వ నమోదులో మన రికార్డును మనమే బ్రేక్ చేసుకోవాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఒక వైపు సభ్యత్వ నమోదు మరో వైపు రైతాంగ సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
బీఆర్‌ఎస్ ఏ విధంగా ప్రజలను మోసం చేసిందో, అలాగే కాంగ్రెస్ కూడా మోసం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. రుణమాఫీపై రైతులకు ఆశలు పెట్టి, 50 శాతం మంది రైతులకు కూడా మాఫీ చేయలేదని ధ్వజమెత్తారు. ఏ గ్రామంలో కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని మండిపడ్డారు. బీజేపీకి చెందిన అన్ని విభాగాలు ప్రజల సమస్యలపై పోరాడతాయని పేర్కొన్నారు. సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ ముక్తి దివస్' కార్యక్రమం చేస్తామని వెల్లడించారు.
భవిష్యత్‌లో అధికారంలోకి బీజేపీ : సికింద్రాబాద్‌లో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నేతృత్వంలో ఇవాళ బీజేపీ సభ్యత్వ నమోదు మహోత్సవం కార్యశాల ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి, కేంద్రమంత్రి బండి సంజయ్, లక్ష్మణ్, అభయ్ పాటిల్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, కుటుంబ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీజేపీ సిద్ధాంత పరంగా పనిచేస్తోందని, క్రమం తప్పకుండా సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలు ఇష్టంతో సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు.
పార్టీ బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం కావాలని కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయాల్లో పోటీతత్వం ఉన్నా ప్రధానిగా మోదీ మూడోసారి గెలిచారని కొనియాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో 70 లక్షలకు పైగా ఓట్లు బీజేపీకి వచ్చాయని గుర్తుచేశారు. భవిష్యత్‌లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో లాగానే ఆన్‌లైన్‌లో సభ్యత్వం నమోదు చేయించాలని సూచించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని అన్ని వర్గాల్లో ఉందని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయం సాధించేందుకు సభ్యత్వ నమోదు ఎంతో దోహదపడుతుందని సూచించారు.
'కుటుంబ పార్టీలు అవినీతికి పాల్పడుతున్నాయి. బీజేపీ సిద్ధాంత పరంగా పనిచేస్తోంది. కార్యకర్తలు ఇష్టంతో సభ్యత్వాలు నమోదు చేయించాలి. బీజేపీ బలపడాలి అంటే సభ్యత్వ నమోదు విజయవంతం కావాలి'- కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు