BRS Leader KTR Comments on Congress Govt : జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీని అడ్డుపెట్టుకుని కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాకరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసి, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందిన కాంగ్రెస్, మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలంటే అహం అడ్డొస్తోందని విమర్శించారు. ఈ మేరకు హైదారాబాద్‌లో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు.
2022లో మేడిగడ్డ ఆనకట్టపై నుంచి నీరు వెళ్లినా తట్టుకున్న విషయాన్ని విస్మరిస్తోందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే కాంగ్రెస్ నేతలే కాళేశ్వరం ప్రాజెక్టును ఏదైనా చేశారేమో అనే అనుమానం కలుగుతోందని కేటీఆర్ ఆక్షేపించారు. నిర్వహణ లోపం ఉంటే అక్కడ ఒక్క చోటే ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఏదో కుట్ర జరిగిందన్నదే తన వ్యక్తిగత అనుమానంగా పేర్కొన్నారు.
ఎన్డీఎస్ఏ నివేదిక కాదు - బీజేపీ కార్యాలయంలో సిద్ధమైన నివేదిక : తమను ఓడగొట్టేందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారేమోనని అనుమానం వ్యక్తం చేసిన కేటీఆర్, రేపు ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే, ప్రస్తుత ప్రభుత్వానిదే బాధ్యతని తేల్చిచెప్పారు. అన్ని విషయాల్లో బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, ఎన్డీఎస్ఏ విషయంలో ఎందుకు ఏకీభవిస్తోందని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదిక కాదని, బీజేపీ కార్యాలయంలో సిద్ధమైన నివేదికగా పేర్కొన్నారు.
శ్రీపాద ఎల్లంపల్లిలో ఇప్పుడు నడిపిస్తున్న పంపులను కేసీఆర్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని గుర్తు చేసిన కేటీఆర్, ఎల్లంపల్లి నీరు సరిపోదని, కన్నెపల్లి నుంచి ఎత్తిపోయడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ద్వారా ఒక పంటకు 36 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం ఉందన్న మాజీ మంత్రి, ఇప్పటికైనా నీటిని రైతుల పొలాలకు మళ్లించాలని సూచించారు.
KTR Vs Minister Uttam Kumar : రిజర్వాయర్లు నింపాక వర్షాలు వేస్తే కిందికి వదిలితే తప్పు ఏముందన్న మాజీ మంత్రి, కొంత కరెంట్ బిల్లు అవుతుంది తప్ప అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి కరవుకు ఇన్సూరెన్స్ లాంటిందిగా పేర్కొన్నారు. 60 నుంచి 70 లక్షల ఎకరాలకు మేలు చేసే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 94 వేలు కోట్లు ఖర్చు చేస్తే అవినీతి అంటున్నారని దుయ్యబట్టారు. 1.50 లక్షల కోట్లతో మూసీ అభివృద్ధి చేస్తే ఎంత మంది రైతులకు లాభం కలుగుతుందని ప్రశ్నించారు.
ఎవరు కమిషన్ల కోసం ఏం చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. ప్రజల సొమ్ముతో ప్రాజెక్టు కట్టామని, వృథా చేస్తారా? అని ప్రశ్నించిన కేటీఆర్, కరెంట్ ధర గురించి చూస్తున్నారు. కానీ, రైతుల పంట గురించి ఆలోచించరా? అంటూ నిలదీశారు. బేషజాలకు పోయి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి పంపులు నిలిపివేస్తే మా కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సీతారామ తరహాలో సిద్దంగా ఉన్న మల్కాపూర్, గౌరవెల్లి, బస్వాపూర్ జలాశయాల్లో నీరు నింపి కాంగ్రెస్ నేతలు నెత్తిపై చల్లుకోవచ్చునన్నారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ కడతారో, ఏం చేస్తారో, చూద్దామని అక్కడ అంగీకరించేది లేదని మహారాష్ట్ర స్పష్టంగా చెప్పిందన్నారు.
పసలేని, దిశలేని, దండగమారి బడ్జెట్ - ప్రభుత్వ పద్దుపై కేటీఆర్ ట్వీట్ - KTR tweet on state budget 2024