BRS MP Candidates List 2024 : లోక్‌సభ ఎన్నికలో బరిలో దిగే భారత్ రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితా ఖరారైంది. హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)అభ్యర్థులను ప్రకటించారు. ఐదుగురు సిట్టింగ్ ఎంపీలు పార్టీకి గుడ్ బై చెప్పగా మిగిలిన ముగ్గురు సిట్టింగులకు మరో మారు అవకాశం కల్పించారు. పార్టీ లోక్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావు ఖమ్మం నుంచి మరోమారు బరిలో దిగనున్నారు. మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మహబూబ్‌నగర్‌లో మన్నె శ్రీనివాస్‌రెడ్డి మళ్లీ పోటీ చేయనున్నారు.
గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బోయినపల్లి వినోద్ కుమార్ మరోమారు కరీంనగర్ నుంచి పోటీచేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి, శాసనసభ్యుడు పద్మారావు గౌడ్‌కు లోక్‌సభ అవకాశం కల్పించారు. మెదక్ ఎంపీ అభ్యర్థిగా శాసనమండలి సభ్యుడు పి.వెంకట్రామిరెడ్డి పేరు ఖరారు చేశారు. సికింద్రాబాద్, మెదక్ రెండు చోట్లా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి పార్లమెంట్ అవకాశం కల్పించారు. పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి, సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ బరిలో దిగనున్నారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, చేవెళ్లలో మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేయనున్నారు.
సికింద్రాబాద్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ - Secunderabad BRS MP Candidate
Telangana Lok Sabha Elections 2024 : నాగర్‌కర్నూల్ నుంచి బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ (BRS MP Candidates 2024) అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. భారత్ రాష్ట్ర సమితి, బీఎస్పీ పొత్తు ఫలించకపోవడం వల్ల ఆయన గులాబీ కండువా కప్పుకొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగనున్నారు. జహీరాబాద్, వరంగల్, మల్కాజ్గిరి, భువనగిరి, నల్గొండ నుంచి కొత్త వారికి లోక్‌సభ ఎన్నికల్లో అవకాశం కల్పించారు.
జహీరాబాద్ నుంచి గాలి అనిల్‌కుమార్, మాజీ మంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ నుంచి అదృష్టం పరీక్షించుకోనున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి రాగిడి లక్ష్మారెడ్డి భువనగిరిలో క్యామ మల్లేశ్, నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి గులాబీ పార్టీ అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. ఇప్పటివరకూ ప్రకటించిన 16 స్థానాల్లో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు. మిగిలిన 11 స్థానాల్లో ఐదింటిని బీసీలకు కేటాయించారు. ఇద్దరు విశ్రాంత అఖిల భారత సర్వీసు అధికారులకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చింది.
2019 లోకేేసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో కేవలం నలుగురు మాత్రమే మళ్లీ గులాబీ కండువాపై ఎన్నికల బరిలో దిగుతున్నారు. సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాత్రమే మరోమారు పోటీలో ఉండనున్నారు. హైదరాబాద్ నుంచి బీసీ అభ్యర్థి పేరునే ఖరారు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే 12 జనరల్ స్థానాల్లో ఆరు బీసీలకు కేటాయించినట్లు అవుతుంది.
నల్గొండ, భువనగిరి ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ - BRS MP Candidates List 2024