MLA Padi Kaushik Reddy Challenge To Minister Ponnam Prabhakar : నిబంధనలకు విరుద్ధంగా రవాణా అవుతున్న బూడిద పంచాయితీ కాస్తా దేవుని వద్ద ప్రమాణాలకు దారి తీయడం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్టీపీసీ బూడిద రవాణాపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బూడిద రవాణాలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముడుపులు తీసుకున్నారని ఆరోపించిన కౌశిక్‌రెడ్డి ఏకంగా లారీలను అడ్డుకున్నారు. ఆ వ్యవహారంపై ఆగ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ దినపత్రికతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు.
పొన్నం నోటీసులపై స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అవినీతి చేయకపోతే జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని మంత్రి పొన్నంకి సవాల్ విసిరారు. ఆ సవాల్‌కి హుజురాబాద్ కాంగ్రెస్ ఇంఛార్జి వొడితెల ప్రణవ్ ఎదురు దాడికి దిగారు. కౌశిక్‌రెడ్డి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశారని తన వ్యాఖ్యలు తప్పయితే హుజురాబాద్ నియోజకవర్గంలోని చెల్పూర్ ఆంజనేయస్వామి ఆలయం వద్దకు వచ్చి తడిబట్టలతో ప్రమాణం చేయాలని ప్రతిసవాల్ విసిరారు. ఆ సవాల్ స్వీకరించిన కౌశిక్‌రెడ్డి చెల్పూరుకి వస్తానని ప్రకటించారు.
చెల్పూర్ హనుమాన్ ఆలయం ఉద్రిక్తత : శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద ఫ్లెక్సీలు తొలగించారు. హైదరాబాద్ నుంచి వీణవంక చేరుకున్న ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్‌లను అడ్డుకుని గృహా నిర్బంధం చేశారు. ఇరుపార్టీల నాయకులు చెల్పూర్ వెళ్లకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. కొందరు చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్దకు రాగా పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.
కోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కౌశిక్‌రెడ్డి రూ.20 లక్షలు తీసుకొని మోసం చేశాడంటూ ఓ బాధితుడు తడిబట్టలతో ప్రమాణం చేశారు. దీంతో హనుమాన్ ఆలయం వద్ద కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వంపై కౌశిక్‌రెడ్డి అనవసర ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు.
చెల్పూర్ ఆలయానికి వస్తుండగా పోలీసులు వీణవంకలో గృహనిర్బంధం చేయటంతో తను ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ కౌశిక్ రెడ్డి అక్కడే ప్రమాణం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం అపోలో వెంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని మరోసారి సవాల్ విసిరారు. ఆలయానికి వచ్చి ప్రమాణం చేయకపోతే అవినీతి చేసినట్లు పొన్నం ఒప్పుకున్నట్లేనని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
బూడిద రవాణా విషయంలో ఆరోపణలు చేయటం కాదని ఆధారాలుంటే చూపెట్టాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ ప్రణవ్ హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌పై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్- బీఆర్ఎస్ నేతల సవాళ్లు- ప్రతిసవాళ్లతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది.
మంత్రిపై నిరాధార ఆరోపణలు - ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు