BRS Leaders Fires on Kadiyam Srihari : బీఆర్ఎస్ సీనియర్ నేత, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ వీడుతుండటంపై గులాబీ నేతలు మండిపడ్డారు. ప్యాకేజీలు మాట్లాడుకుని కడియం అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు.
Kadiyam Srihari Resigns To BRS : బీఆర్ఎస్‌లో ఎన్నో పదవులు అనుభవించిన కడియం శ్రీహరి (Kadiyam Srihari Resign BRS) కష్టకాలంలో పార్టీకి అండగా ఉండకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అభ్యర్థిత్వం ప్రకటించాక పార్టీ మారిన చరిత్ర ఆ కుటుంబానికే దక్కుతుందని విమర్శించారు. ఆయన కారణంగా భారత్ రాష్ట్ర సమితి చాలా మంది నాయకులను కోల్పోయిందని అన్నారు. కడియం శ్రీహరి పార్టీ మారినంత మాత్రాన వచ్చిన నష్టమేమి లేదని, ఎంతోమంది నాయకులు, కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటారని అన్నారు. కానీ కడియంతో సహా పార్టీ మారి వచ్చే నేతలతో కాంగ్రెస్ జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్ నాయకులు సూచించారు.
"కడియం శ్రీహరి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆయన ఏ పార్టీలో ఉన్నా కార్యకర్తలను అణచివేసేవారు. ఆయన రాజీనామా ఆశ్చర్యం కలిగించింది. తెలంగాణ వాదానికి కట్టుబడి ఉంటానంటేనే కడియం శ్రీహరిని పార్టీలోకి ఆహ్వానించాం. ఆయన కోసం చాలా మంది నేతలను బీఆర్ఎస్ కోల్పోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కేసీఆర్ స్టేషన్ ఘన్‌పూర్ సీటు ఇచ్చారు. ఎంతో మంది వ్యతిరేకించినా కడియం కుమార్తెకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆయనకు రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చాం. ఎమ్మెల్యే పదవికి కడియం రాజీనామా చేయాలి." - దాస్యం వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
గురువారం నాడు స్టేషన్‌ఘన్‌పూర్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేశారు. తన కుమార్తె కావ్యతో కలిసి ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. వరంగల్ ఎంపీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడం లేదని కావ్య ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఓరుగల్లులో గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారే పరిస్థితి నెలకొంది.
ఏప్రిల్ 13న చేవెళ్లలో కేసీఆర్ బహిరంగ సభ : కేటీఆర్ - KCR CHEVELLA PUBLIC MEETING