Sabita Indra Reddy Tweet About Minister Surekha Comments : బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తునట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. మర్యాద ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంటుందని మంత్రి కొండా సురేఖకు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఎక్స్ వేదికగా స్పందించిన సబిత, కేటీఆర్ గురించి కొండా సురేఖ మాట్లాడింది ఆక్షేపణీయమని అన్నారు.
రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదని, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదని ఆక్షేపించారు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు గురించి మాట్లాడాలని, సమాజానికి ఆదర్శంగా ఉండాలని సబిత తెలిపారు. కొండా సురేఖ చేసిన ఆరోపణతో కేటీఆర్ తల్లి, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా అని ప్రశ్నించారు. వాళ్లు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా ఆలోచించారా? అని అడిగారు. బాధ్యత గల పదవిలో ఉండి మంత్రి కొండా సురేఖ బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం బాధాకరమని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
@IKondaSurekha
— Sabitha Reddy (@BrsSabithaIndra) October 2, 2024
సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. @KTRBRS గారి గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి. Cont
కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి : మంత్రి కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ శాసనసభ్యుడు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయ వాదనల్లో పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతారన్న మార్గరెట్ థాచర్ కోట్‌ను పోస్ట్‌తో జతపరిచారు.
I condemn the derogatory statements made by Minister @IKondaSurekha garu and demand an unconditional apology. pic.twitter.com/YLtMQV70QY
— Harish Rao Thanneeru (@BRSHarish) October 2, 2024
RS Praveen Kumar Comments On Minister Konda Surekha : కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదని, ఆమె చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకెళ్తామని తెలిపారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, కొండా సురేఖతో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ప్రపంచ బ్యాంకుతో సీఎం రేవంత్ రెడ్డి కుమ్మక్కై మూసీ సుందరీకరణ అంటున్నారని, ఆయన ధనదాహానికి హైడ్రా ఆయుధంలా మారిందని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి బండారం త్వరలో బట్టబయలు అవుతుందని, శ్రీలంకలో రాజపక్సే సోదరులపై ప్రజలు తిరుగుబాటు చేసినట్లు సీఎంపై తిరుగుబాటు తప్పదని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ప్రపంచ బ్యాంకు వైపు ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పీడిత ప్రజల పక్షాన ఉందని ప్రవీణ్ కుమార్ అన్నారు. మూసీ సుందరీకరణ పేరుతో రూ.లక్షా 50 వేల కోట్ల అవినీతిని అడ్డుకున్నందునే బీఆర్ఎస్ నేతలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టపగలు కేటీఆర్ కాన్వాయ్ పై దాడి చేశారన్న ఆయన, పోలీసుల వైఖరి అనుమానస్పదంగా ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి కుట్రకు పోలీసులు పావులు అవుతున్నారని, కేటీఆర్ కాన్వాయ్‌పై దాడి జరిగి 26 గంటలు అయినా నిందితులను పోలీసులు అరెస్టు చేయలేదని ఆక్షేపించారు.
మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేస్తాం : రాష్ట్రంలో మహిళలపై దాడులు, మానభంగాలు, హత్యలు జరిగినా ఏ రోజు మాట్లాడని కొండా సురేఖ, తనపై వచ్చిన ట్రోలింగ్ వార్తలను చూపించుకుంటూ ఏడుస్తుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కొండా సురేఖ చిత్ర పరిశ్రమలోని మహిళలను కించపరిచేలా మాట్లాడారన్న ఆమె, ప్రభుత్వంలో ఉన్న మహిళ మంత్రి ఇలా మాట్లాడడం శోచనీయమన్నారు. మంత్రి కొండా సురేఖ ఇలానే మాట్లాడితే పరువునష్టం దావా వేస్తామని సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.
సమంత - నాగ చైతన్య విడిపోడానికి కారణం కేటీఆర్ : కొండా సురేఖ - Konda Surekha Fires On KTR