BRS Leader Niranjan Reddy on Irrigation : రెండు తెలుగు రాష్ట్రాలు ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించాయని, ఎవరినీ సంప్రదించకుండానే ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) మండిపడ్డారు. పదేళ్లు అవుతున్నా నీటి కేటాయింపులే కేంద్రం ఇంకా తేల్చలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో కృష్ణా నదీ జలాల(Krishna River Waters) విషయంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ సమక్షంలో పార్టీ నాయకుల సమావేశం జరిగింది. అనంతరం నిరంజన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
రైతుబంధు అంశాన్ని ప్రభుత్వం పరిహాసం చేస్తోంది : మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
Niranjan Reddy on Krishna River Water : కృష్ణా నదీ జలాలు ఎవరి వాటా నీళ్లు వాళ్లు దక్కించుకోవాలని నిరంజన్ రెడ్డి అన్నారు. అందుబాటు జలాల మేరకు ప్రాజెక్టులు నిర్మించుకోవాలని సూచించారు. కాంగ్రెస్(Congress) అనాలోచిత నిర్ణయం వల్ల రాష్ట్రం నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నందున ప్రధాన ప్రతిపక్షంగా పోరాటం చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తాగునీరు వాడుకోవాలన్నా, విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా కేంద్రాన్ని అభ్యర్థించాలని వ్యాఖ్యానించారు.
కృష్ణా జలాలపై చిత్తశుద్ధి చూపించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి : నిరంజన్ రెడ్డి
"నల్గొండ సభ మరోమారు ఉద్యమ శంఖారావం పూరించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యం. తెలంగాణ ప్రజలకు జీవన్మరణ సమస్య మరోమారు తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పెద్ద తప్పు చేసింది. రాష్ట్ర ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం పణంగా పెట్టింది. చేసిన ఘోర తప్పిదానికి రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాలి. ప్రాజెక్టులు అప్పగించేందుకు కేసీఆర్ అంగీకారం తెలిపారని చెప్పడం శుద్ధతప్పు. ఎవరికి మేలు చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు?. ఎట్టి పరిస్థితుల్లోనైనా నల్గొండలో సభ నిర్వహించి తీరతాం. అవసరమైతే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటాం."- నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి
Niranjan Reddy Nalgonda BRS Meeting : కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా ఇవ్వాల్సిందేనని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. 1080 టీఎంసీల్లో తెలంగాణకు 540 టీఎంసీలు రావాలని వివరించారు. తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు లాంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపులపై ఆరు నెలల్లో ట్రైబ్యునల్ తీర్పు వెలువడాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 13న నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ సమావేశంలో కృష్ణా ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామని పేర్కొన్నారు. కృష్ణా ప్రాజెక్టులు వదిలేసి ఎక్కడో చిన్న పగుళ్ల గురించి అతిగా మాట్లాడుతున్నారని అన్నారు.
కేసీఆర్ సీఎంగా లేకపోవడాన్ని పార్టీ నాయకులు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు : నిరంజన్‌రెడ్డి