BRS Harish Rao Comments On Rahul Gandhi : నిర్మల్ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు తెలిపారు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సిద్దిపేట భారతీనగర్‌లో తన నివాసంలో హరిశ్‌రావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌పై పలు విమర్శలు చేశారు.
Harish Rao Fires On Congress : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేయనందుకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మహిళలకు రూ.2500 వేస్తున్నామని అమలుకాని హామీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలపై చర్చించేందుకు తాను సిద్ధమని ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని సవాల్ చేశారు. అబద్ధాలకు సీఎం రేవంత్ రెడ్డి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు.
"వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలి. ఆ తర్వాతనే పార్లమెంట్ ఎన్నికలకు ఓట్లు వేయాలని అడగాలని కోరుతున్నాను. ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ, ఆయన తల్లి, చెల్లి వంద రోజుల్లో హామీలు అమలు చేయించే బాధ్యత తమది అని చెప్పారు. వందరోజులైపోయి నూటయాబై రోజులైనా గ్యారంటీలు అమలు చేయనందుకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి అన్నీ అమలయ్యాయని రాహుల్ గాంధీ చెప్పడం చూస్తుంటే రాజుగారి దేవతా వస్త్రాల కథ గుర్తుకు వస్తుంది"- హరీశ్ రావు, బీఆర్ఎస్ నేత
రాహుల్ గాంధీకాదు రాహుల్ రాంగ్ గాంధీ : రాహుల్ గాంధీ చెప్పేది తప్పైతే ఆ పక్కనే కూర్చున్న సీఎం రేవంత్ రెడ్డికి చెప్పాల్సిన బాధ్యత ఉందా? లేదా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇద్దరు కలసి కూర్చుని ఇయ్యని రూ.2500 ఇస్తున్నామని చెప్పి అమాయక ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ఆయన రాహుల్ గాంధీ కాదు రాహుల్ రాంగ్ గాంధీ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.