Jagadish reddy fires on CM Revanth : ఎన్నికల హామీలను నెరవేర్చటంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress), లీకు, ఫేక్ కథనాలతో కాలం గడుపుతోందని మాజీమంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి(Jagadish reddy) దుయ్యబట్టారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రైతులు మళ్లీ అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చింది : జగదీశ్ రెడ్డి - BRS MLA Jagadeesh Reddy
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ, ప్రజా సమస్యలు బయటకు రాకుండా, ఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్‌ఎస్ పార్టీని బద్నాం చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. తాగు, సాగు నీరు లేక ప్రజలు, రైతులు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. రైతు సమస్యలు, రైతు మరణాలపై మాట్లాడిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
lok sabha elections 2024 : రేవంత్‌రెడ్డి బాటలోనే నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఒక్కొక్క మిల్లు యాజమాన్యం నుంచి రెండు, మూడు కోట్లు వసూలు చేస్తున్నారని, ఇవ్వకపోతే కేసులు పెట్టి జైల్లో వేస్తామని బెదిరించి దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. మిల్లర్లు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలేదని, మంత్రులు కాంగ్రెస్ నాయకులు రైస్‌మిల్లర్లను గట్టిగా అడగలేని పరిస్థితి నెలకొందన్నారు.
మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసి దాంట్లో కొంత దిల్లీకి కప్పం కడుతున్నారని, ఇక రైతుల గోడు వినేది ఎవరని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల కోసం గొంతు ఎత్తి కొట్లాడే కేసీఆర్‌ను(KCR) టచ్ చేయడం ఎవరి తరం కాదన్నారు. రాష్ట్రమంతా కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని, గత వందరోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మంది రైతులు చనిపోయారని ఆయన గుర్తు చేశారు.
రైతులు పండించిన ధాన్యానికి కనీస ధర కూడా ఇప్పించ్చే సోయిలో ప్రభుత్వం లేదని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం అని కొంత సమయం ఇచ్చి చూశామని, హామీల అమలు కోసం ఇకనుంచి వెంటపడనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు అభ్యర్థులు కరువై, తమ పార్టీ నుంచి వెళ్లిన వాళ్ళే దిక్కయ్యారని అన్నారు. ఒక్క నాయకుడు పోతే 100మంది నాయకులను తయారుచేసే శక్తి కేసీఆర్‌కు ఉందన్నారు.
ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీజేపీలు రెండు ఒకటేనని వాటి వల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పి తెలంగాణ హక్కుల కోసమే కొట్లాడే బీఆర్‌ఎస్‌ను ఆదరించాలని కోరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నల్గొండ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
వసూళ్లపై ఉన్నంత శ్రద్ద ప్రభుత్వానికి రైతుల సమస్యలపై లేదు : జగదీశ్ రెడ్డి
పాలన చేతకాక అప్పులు, అప్పులు అంటూ పాడిందే పాడుతున్నారు : జగదీశ్ రెడ్డి