BJP State President Purandeshwari Accused YSRCP : ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. అధికార పార్టీ కుట్రలపై తమకు సమాచారం ఉందని తెలిపారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారు - బీజేపీని ఆశీర్వదిస్తారు: పురందేశ్వరి
తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లో అక్రమంగా గెలిచినట్లే మరోసారి అడ్డదారుల్లో ఓట్లు పొందేలా వైకాపా కుట్రలు చేస్తుందన్న సమాచారం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. వైకాపా సానుభూతిపరులు రెండు చోట్ల ఓట్లు వేసేలా వైకాపా ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా వాడుకుంటామన్న ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలను పురందేశ్వరి తప్పుబట్టారు. వాలంటీర్లు వద్దని ఈసీ పదేపదే చెబుతున్నా ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం- పొత్తుల అంశంపై అధిష్ఠానానిదే నిర్ణయం: పురందేశ్వరి
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. గతంలో తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల అక్రమాలను గుర్తు చేస్తూ అక్రమాలకు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు కల్పించి రెండు నియోజకవర్గాల్లో వాడుకోవాలని చూస్తున్నారని తెలిపారు. వారందరినీ ప్రత్యేకంగా బస్సుల్లో తరలించి ఉదయం, మధ్యాహ్నం వేర్వేరు ప్రాంతాల్లో ఓట్లు వేసేలా వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారని తెలిపారు. ఇదంతా అధికార దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. గతంలో స్వల్ప తేడాతో ఓడిన ప్రాంతాల్లో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని తమకు సమాచారం ఉన్నదని చెప్పారు.
వాలంటీర్లను ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకుంటామన్న మంత్రి ధర్మాన ప్రసాద్ వ్యాఖ్యలను పురందేశ్వరి తప్పుబట్టారు. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు వద్దని ఈసీ స్పష్టం చేసిందని తెలిపారు. అయినా సరే వాడుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేయడం ఆందోళనకరం. పోలీసు వ్యవస్థపై పెద్ద బాధ్యత ఉంది. ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేయాలి. దొంగ ఓట్లు, నకిలీ ఎపిక్ కార్డులు గుర్తించేందుకు విచారణ జరుగుతోంది. ఈ విషయంలో ఇప్పటికే పలువురు అధికారులను, పోలీస్ ఉద్యోగులను సస్పెండ్ చేశారని పురందేశ్వరి తెలిపారు.
బీజేపీ 'పల్లెకు పోదాం'- ఈ నెల 12 నుంచి 21 వేల గ్రామాల్లో పర్యటన