Raghunandan Rao Fires On CM Revanth : భారత రాజ్యాంగం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే 'దెయ్యాలు వేదాలు వల్లించినట్టు' ఉందని బీజేపీ నేత రఘునందర్ రావు అన్నారు. సాక్షాత్తు రాజ్యాంగం రాసిన డా.బి.ఆర్ అంబేడ్కర్ మళ్లీ పుట్టి వచ్చినా రాజ్యాంగం మార్చడం కుదరదన్నారు. గత పదేళ్ల నుంచి రాజ్యాంగాన్ని మార్చలేదని భవిష్యత్‌లోనూ బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయదని స్పష్టం చేశారు.
అబద్ధాలు చెప్పడంలో రేవంత్ రెడ్డి కేసీఆర్ కంటే రెండు ఆకులు ఎక్కువ చదువుకున్నారనీ రఘునందన్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నూరు అబద్ధాలు ఆడితే రేవంత్ రెడ్డి వెయ్యి అబద్దాలు అడి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. మెదక్‌లో బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని కేటీఆర్, కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆ నినాదంతోనే బీఆర్ఎస్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తామని సవాల్ చేశారు.
'రాజ్యాంగ సవరణ జరుతుంది తప్ప సంవిధానాన్ని మార్చడం జరగదని మోదీ చాలా స్పష్టంగా చెప్పారు. 106 సార్లు ఈ దేశ రాజ్యాంగానికి సవరణలు జరిగాయి. మెజార్టీ సార్లు రాజ్యాంగాన్ని సవరించింది కాంగ్రెస్ పార్టీయే. భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేడ్కర్ సెక్యులరిజం అనే పదాన్ని పెట్టలేదు. 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరాగాంధీ తీసుకొచ్చిపెట్టారు. రాజ్యాంగ సవరణ విషయంలో నేను చర్చకు సిద్ధం. భారత రాజ్యాంగానికి తొలిసారిగా సవరణ ఎప్పుడు జరిగిందో సీఎం రేవంత్‌కు తెలుసా? బట్ట కాల్చి మీద వేయవద్దు అవగాహనతో మాట్లాడాలి.' అని రఘునందన్ రావు హితవు పలికారు.
బీజేపీకి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక పొత్తుల దుష్ప్రచారం చేస్తున్నారు : రఘునందన్ రావు
ఈ రాష్ట్రంలో ఎమర్జెన్సీపెట్టి, పత్రికా స్వేచ్ఛను హరించి ప్రతిపక్షాలను జైళ్లో పెడదామనుకుంటున్నారా? అని సీఎం రేవంత్‌ను రఘునందన్ రావు ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్‌నే ప్రత్యక్షంగా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించిందని విమర్శించారు. అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వని స్పృహలేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. షాబానో కేసులో ముస్లిం మహిళలకు మనోవర్తి ఇవ్వడం న్యాయమని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ చించి అవతల పడేసిందని ఆరోపించారు. ముస్లిం మహిళలకు మనోవర్తి అవసరం లేదని రాజ్యాంగాన్ని సవరించిన రాజీవ్ గాంధీ అప్పటి కాంగ్రెస్ ప్రధానమంత్రి అని దుయ్యబట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి తరచూ ఇందిరమ్మ రాజ్యం అంటారు. ఇందిరమ్మ రాజ్యంలో రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులను రద్దు చేశారు. ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులను ఇందిరాగాంధీ రద్దు చేశారు. జర్నలిస్టుల ఆఫీసుల్లో పోలీసులను కూర్చోబెట్టి ఏ వార్తలు రాయించారో గుర్తు చేసుకోవాలి. రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. నరేంద్రమోదీ అధికారంలో ఉన్న పదేళ్లలో ఉన్న రిజర్వేషన్‌కు తోడు మరో పదిశాతం కల్పించింది. ఉన్న రిజర్వేషన్లతో పాటు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనని. - రఘునందన్ రావు, మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి