BJP Leaders Protest on Farmer Guarantee Implementation Completed : హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా బీజేపీ ప్రజా ప్రతినిధులు చేపట్టిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన 8 హామీలైన రైతు రుణమాఫీ, రైతుబీమా, రైతు భరోసా, కౌలు రైతులు, కూలీలు, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అంశాలపై సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్షను మంగళవారం ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ అభయ్ పాటిల్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు.
రైతు హామీల సాధన దీక్ష స్థలి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్లపై బీజేపీ ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. రానున్న రోజుల్లో ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ అభయ్ పాటిల్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమస్యను వెతకాల్సిన అవసరం లేదని, అధికార పార్టీ వాళ్లే అనేక సమస్యలు సృష్టించి మనకు ఇస్తున్నారన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి కోర్టు మొట్టికాయలు : రేవంత్ రెడ్డి ఎవ్వరి మాట వినడం లేదని, ఎవరి మాట వినని వాడు సైకో అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. హైకోర్టు వేసిన మొట్టికాయలు నేరుగా రేవంత్ రెడ్డికి తగిలాయని, చట్టం మీద గౌరవం ఉంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అరాచక పాలన నడుస్తోంది : రాష్ట్రంలో ఆరాచకపాలన నడుస్తోందని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజినిలా ప్రవర్తిస్తూ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే అన్ని సామాజిక వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి దిల్లీ టూ తెలంగాణకు చక్కర్లు కొడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి దిల్లీలో కప్పం కట్టేందుకు పని చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రినా? దిల్లీకి కప్పం కట్టే మంత్రినా అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన జేబులు నింపుకోవడానికే తప్ప మరొకటి లేదన్నారు. కాంగ్రెస్ చరిత్రంతా అవినీతేనన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
"కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో ట్యాక్స్‌ల పేరుతో రూ.కోట్లు వసూళ్లు చేసింది. ఆర్, బీ ట్యాక్స్, ఆర్ఆర్ఆర్ ట్యాక్సీల అవినీతిని బయట పెట్టాం. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో పొంగులేటి కమీషన్, మేఘా కంపెనీల కమీషన్లు బయట పెట్టాం. తుమ్మల నాగేశ్వర్ రావు మాటలను ఖండిస్తున్నా. మోదీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని తుమ్మలకు గుర్తు చేస్తున్నాం" - ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ శాసనసభాపక్షనేత