BJP Leaders Fires on HYDRA : హైడ్రాపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తుందని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసీ నది సుందరీకరణ చేస్తానంటూ, స్థానికుల గూడు చెదరగొట్టే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని ఆయన మండిపడ్డారు. సికింద్రాబాద్లోని అల్వాల్ జొన్నల బండ సమీపంలో నివసిస్తున్న స్థానికులకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులకు ఎంపీ ఈటల రాజేందర్ ధైర్యం చెప్పడానికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నోటీసులు వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదని, బీజేపీ పేదల పక్షాన అండగా ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పనితీరు తెలుసుకోవడానికి ఆరేళ్ల సమయం పడితే రేవంత్ రెడ్డి పాలన తెలుసుకోవడానికి కేవలం ఆరు నెలల్లోనే తెలిసిపోయిందన్నారు. ఏడు దశాబ్దాలుగా వడ్డెర వర్గానికి చెందిన వారు ఇక్కడే నివాసం ఉంటున్నారు. ఇప్పుడేమో అక్రమ కట్టడాలు అంటూ నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి నోటీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని బీజేపీ అండగా ఉందన్నారు. శని, ఆదివారాలు సెలవు రోజుల్లో నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా కూల్చివేతలు నిర్వహిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్మాణాలు కూల్చేసే ముందు స్థానికులు సమాధానం చెప్పాలి : సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడే మూసీ సుందరీకరణ ఆలోచన ఎందుకు వచ్చిందని పలువురు చర్చించుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. గతంలో పలుమార్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మూసీ సుందరీకరణపై ఎప్పుడు ఆ ప్రభుత్వాలకు రాని ఆలోచన ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఎందుకు వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. నిర్మాణాలు కూల్చివేసే ముందు స్థానికులు ఎక్కడికి వెళ్లాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అధికారుల చర్యల వలన స్థానికులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. అక్కడున్న ఇళ్లను కూల్చివేసే ముందు ప్రభుత్వం స్థానికులకు ప్రత్యామ్నాయాలు చూపించాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. నార్సింగి నుంచి నాగోలు వరకు మూసీకి ఇరువైపులా ఉన్న ఇళ్లును అధికారులు పరిశీలించి వెళ్లారు. త్వరలో కూల్చివేతలు ఉంటాయని వారు చెబుతున్న నేపథ్యంలో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలియజేశారు.