BJP leader Pathuri Nagabhushanam Allegations on CS: గత రెండు నెలలుగా రాజకీయాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి కేంద్రంగానే జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం ఆరోపించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం పాతూరి నాగభూషణం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎస్, వైఎస్సార్సీపీపై నిప్పులు చెరిగారు. మూడు రాజధానుల ప్రకటన తర్వాత విశాఖలో అధికారపక్ష నేతలు భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. సీఎస్ సైతం వందల ఎకరాల భూ కుంభకోణానికి పాల్పడినట్లు వస్తున్న విమర్శలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎస్‌ను బదిలీ చేయలేదుగా: బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైఎస్సార్సీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నాగభూషణం మండిపడ్డారు. తాము లేఖలు ఇచ్చిన వారిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేస్తోందని చేస్తోన్న ప్రచారం అవాస్తవమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను బదిలీ చేయాలంటూ ఎన్నికల నోటిఫికేషన్ సమయంలోనే తమ పార్టీ అధ్యక్షురాలు లేఖ ఇచ్చినా - కేవలం డీజీపిని మార్చి సీఎస్‌ను బదిలీ చేయలేదని అన్నారు. ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో కొందరు అధికారులు ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు.
సీఎస్ విఫలమయ్యారు: ఓవైపు పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు అడుగంటిపోయాయని, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల వాసులు తాగునీటికి కటకటలాడుతున్నారని తెలిపారు. అయినా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వాస్తవాలపై సమీక్షించి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని - రైతులు, ప్రజల గురించి ఎవరూ పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదన్నారు. సీఎస్‌పై విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులు, పరువు నష్టం దావా వేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు చేస్తే వాటికి ధీటుగా బదులివ్వలేక ఈ బెదిరింపులు ఏమిటని నాగభూషణం ప్రశ్నించారు.
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా: రాష్ట్రంలో యథేచ్ఛగాా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని నాగభూషణం ఆరోపించారు. కేంద్ర పర్యావరణ కమిటీ వచ్చే వరకు ఇసుక రేవులను నిలిపివేయాల్సిందిపోయి, అధికారులే ఇసుక రేవుల్లో యథేచ్ఛగా అక్రమ రవాణాకు సహకరించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. సచివాలయానికి సమీపంలో ఎంపీ నందిగాం సురేష్ మనుషులు అర్దరాత్రి వేళ డ్రెడ్జర్లతో ఇసుక తవ్వుతుంటే అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని నాగభూషణం ప్రశ్నించారు. త్వరలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, అక్రమాలకు పాల్పడ్డ ఎవ్వరినీ వదలబోమని ఆయన హెచ్చరించారు.