BJP Leader Etela Rajender Comments On BRS : పేద ప్రజల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో గత ప్రభుత్వ నిర్లక్ష్యం చేసిందని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మారేడుపల్లిలోని రెండు పడక గదుల ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. పేద ప్రజల ఇళ్ల స్థలాలను తీసుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో రెండు పడక గదుల ఇళ్లను అరకొరగా నిర్మించి లబ్ధిదారులకు అందించకుండా గత ప్రభుత్వం తాత్సారం చేసిందని ఆరోపించారు.
Etela Rajender Election Campaign in Secunderabad : పేద ప్రజల కోసం కేంద్రం ద్వారా వచ్చినా నిధులను గత ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక చతికిలపడిందని అన్నారు. నిరుపేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఈటల రాజేందర్‌కు తమ గోడును చెప్పుకున్నారు. తాను గెలిచిన తర్వాత సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు.
"రెండు పడక గదుల ఇళ్ల కేటాయింపులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేంద్రం ఇచ్చిన నిధులతో అరకొరగా డబుల్ బెడ్ రూములను నిర్మించారు. వాటిని లబ్ధిదారులకు అందించకుండా జాప్యం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే మీ సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తాను." - ఈటల రాజెేందర్, బీజేపీ నాయకుడు
ఇఫ్తార్ విందులో ఈటల : ప్రధాని నరేంద్ర మోదీ పట్ల బోరా ముస్లింలకు ఉన్న నమ్మకం అభిమానం ఎనలేనిదని ఈటల రాజేందర్ అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని తిరుమలగిరిలో బోరా ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో పాల్గొని బోరా ముస్లింలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలుగా నివసిస్తూ తామంతా ఒకటే అనే నినాదంతో ఉన్న బోరా ముస్లింల ఐక్యత అభినందనీయమని ఈటల అన్నారు. గత పది సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి చేసిన అభివృద్ధితో పాటు తీసుకున్న చారిత్రక నిర్ణయాలు ఎంతో గొప్పవని ప్రశంసించారు. దేశ ప్రజలంతా కుల మతాలకు అతీతంగా మోదీ నాయకత్వం కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. బోరా ముస్లిం సమాజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తన కుటుంబంగా భావిస్తున్నారని పేర్కొన్నారు.