BJP Comments on BRS and Congress : లోక్‌సభ ఎన్నికల్లో మూడోసారి అధికారమే లక్ష్యంగా రాష్ట్రంలో బీజేపీ నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర(Vijaya Sankalp Yatra) జోరుగా సాగుతోంది. కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో రోడ్ షోలు, భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తోంది. హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS)కు ఓటు వేస్తే ఒరిగేదేమీ లేదని అన్నారు.
దేశంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ జాతి గౌరవాన్ని పెంచుతున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. జాతీయ రహదారుల విస్తరణ, రైల్వేస్టేషన్ ఆధునికరణ, విమానాశ్రయాల పెంపు, పేద ప్రజలందరికీ నాణ్యమైన బియ్యం పంపిణీ, దేశ ప్రజలకు కరోనా విపత్కర సమయంలో వ్యాక్సిన్ పంపిణీ లాంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పారు.
'బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేదు. కేసీఆర్ కుటుంబం పది సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. వేలాది ఎకరాలు దోచుకున్నారు. వారు వాళ్ల పార్టీ నాయకులు. కేసీఆర్ పూర్తిగా ఆయన కుమారుని ముఖ్యమంత్రిని చేయాలనే ప్రయత్నించారు.' -కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
BJP Leaders on Vijaya Sankalpa Yatra : పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడలో(Koheda) పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండో విడత ప్రజాహిత యాత్రను సంజయ్ ప్రారంభించారు. జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.
దేశం సుభిక్షంగా ఆత్మ గౌరవంతో బతకాలంటే మోదీకే ఓటు వేయాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ యాత్రలో పాల్గొన్న ఈటల, పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 10 సీట్లకుపైగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో చేపట్టిన యాత్రలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి పాల్గొన్నారు. యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న కమలం నాయకులు, పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ ఖాయమని ఉద్ఘాటించారు.
'కాంగ్రెస్ నేతలు ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో చేస్తామని అన్నారు. చేయాల్సింది మీరే. రెండు గ్యారెంటీలు అమలు చేసి ఇప్పుడు ఓట్లు అడుగుతున్నారు. ఇది మోదీ ఎన్నికలు, దేశానికి సంబంధించిన ఎన్నికలు.' - బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
'ఆధారాలుంటే ఎంత పెద్దవారినైనా ఉపేక్షించేది లేదు' - కవితకు సీబీఐ నోటీసులపై బండి సంజయ్
బీజేపీకి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక పొత్తుల దుష్ప్రచారం చేస్తున్నారు : రఘునందన్ రావు