BJP Chief Purandeswari Interview: అభివృద్ధి అంటే అర్థం తెలియని జగన్ ప్రజావేదిక కూల్చివేతతోనే విధ్వంసానికి శ్రీకారం చుట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్న ఆమె వైఎస్సార్సీపీతో కుమ్మక్కు కాదు అది ఫ్లోర్ మేనేజ్‌మెంట్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో ఈటీవీ భారత్ ప్రతినిధికి ఆమె ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
''ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలన విద్వేషం, విధ్వంసం, అరాచకం, అవినీతితో సాగింది. విసిగి వేసారిన రాష్ట్ర ఓటర్లు దుష్ట పాలనకు ముగింపు పలికేందుకు సిద్ధమయ్యారు. రెండు చోట్లా ఎన్డీయే కూటమి అధికారంలోకి రావటం ఖాయం. కేంద్రం నుంచి కొత్త ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అండదండలుంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్తు, బస్సు ఛార్జీలు పెరిగి పేదలు ఆర్థికంగా నష్టపోతున్నారు. వీరిని కొత్త ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుంది.
విధ్వంసంతోనే పాలనకు శ్రీకారం విధ్వంసంతోనే రాష్ట్ర పాలనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కొత్తగా అధికారం చేపట్టిన ఏ ప్రభుత్వమైనా పేదల అభివృద్ధిపై ఆలోచిస్తుంది. ఆ పనులకే ప్రాధాన్యమిస్తుంది. సీఎం జగన్ మాత్రం ప్రజావేదిక కూల్చివేతతో తన ధ్వంసరచనను ప్రారంభించారు. దుర్గమ్మ గుడిలో వెండి సింహాలను ఎత్తుకెళ్లారు. అంతర్వేదిలో రథం తగులబెట్టారు. పిఠాపురంలో ఆలయాలు ధ్వంసం చేసినప్పటికీ ఎక్కడా సరైన చర్యలు లేవు.
ఫ్యాన్ ఓవర్‌స్పీడే సమస్యలకు కారణం: వైఎస్సార్సీపీ దుర్మార్గ పాలనను చూసి ఒక్క పరిశ్రమా రాష్ట్రానికి రాలేదు. పెట్టుబడిదారులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులకు వెళ్లిపోయారు. పరిశ్రమలు రాక యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయారు. అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఇంట్లో ఉండే ఫ్యాన్‌కు ఒకటి నుంచి ఐదు నంబర్ల వరకు పెట్టగలుగుతాం. రాష్ట్రంలో పొరపాటున ఫ్యాన్‌కు 151 స్పీడు(అసెంబ్లీ స్థానాల గురించి ప్రస్తావిస్తూ) పెట్టడంతో ఇంటి పైకప్పు కూలి ప్రజలు శిథిలాల్లో చిక్కుకున్నారు!
రైతులకు అండ లేదు. మహిళలకు భద్రత లేదు. చెత్త సేకరణకూ పన్ను విధించిన చెత్త ప్రభుత్వమిది. రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులపై వెళ్తుంటే హాయిగా ఉంటుంది. రాష్ట్ర రహదారులపైకి మళ్లగానే అడుగు లోతు గుంతలతో గమ్యం చేరతామా? అనే భయం పుడుతుంది. అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇసుక, మద్యం, మైనింగ్ తదితర రంగాల్లో ఎక్కడాలేని దోపిడీకి వైఎస్సార్సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు తెరతీశారు. ఇసుక తవ్వకాల వల్ల రాజమహేంద్రవరంలోని గామన్ వంతెన కూలిపోయే ప్రమాదమేర్పడింది. పలుచోట్ల పర్యావరణమూ దెబ్బతింటోంది. నాణ్యత లేని మద్యంతో పేదల ఆరోగ్యం దెబ్బతింటోంది.
మూడు పార్టీల మూలసిద్ధాంతం ఒక్కటే: తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూల సిద్ధాంతాలు ఒక్కటే. అందరికీ సంక్షేమాన్ని అందిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడటమే లక్ష్యం. వికసిత భారత్ బీజేపీ ధ్యేయం. సమాజమే దేవాలయం- ప్రజలే దేవుళ్లు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా జనసేనాని పవన్‌కల్యాణ్ తన గళం వినిపిస్తారు.
కేంద్రంపై తప్పు నెట్టేందుకు ప్రయత్నం: కేంద్రం రాష్ట్రానికి ప్రకటించిన హామీల్లో 93% వరకు పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడం వల్లే అమరావతి నిర్మాణం, విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు, పోలవరం నిర్మాణం వంటి విషయాల్లో జాప్యమవుతోంది. ఏపీలో కొత్త ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం ముందుకొస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం తామే ఏర్పాటు చేసుకుంటామని అడ్డుపడింది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే ఇచ్చిన హామీలను అమలుచేసేందుకు కేంద్రం ఎప్పుడూ సిద్ధం.
విభజన హామీల్లో కీలకమైన విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుకు 52 ఎకరాలు అవసరమని ప్రతిపాదిస్తే ముంపు భూములు ఎవరైనా ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ముంపు భూములు నిర్మాణానికి అనుకూలంగా లేవని పార్లమెంటులో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్లే రైల్వేజోన్ పట్టాలెక్కలేదు. ఈ విషయం తెలిసినప్పటికీ వైఎస్సార్సీపీ మంత్రులు అవగాహన లేకుండా తప్పును కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పెట్టుబడుల ఉపసంహరణ కాకుండా ఆదాయం పెంచే మార్గాలను ఆలోచిస్తున్నాం.
వైఎస్సార్సీపీతో కుమ్మక్కు కాలేదు: ముఖ్యమైన బిల్లుల ఆమోదం విషయంలో రాజకీయ పార్టీలతో వ్యవహరించే తీరు(ఫ్లోర్ మేనేజ్‌మెంట్)పై అపోహలు ఆపాదించవద్దు. వైఎస్సార్సీపీతో మా పార్టీ ఎప్పుడూ కుమ్మక్కు కాలేదు. ఆర్టికల్ 371 వంటి బిల్లుల ఆమోదం విషయంలో ఫ్లోర్ మేనేజ్‌మెంట్ విధానంలో వ్యవహరించినంత మాత్రాన పార్టీలతో సఖ్యంగా ఉన్నట్టు అర్థం చేసుకుంటే ఎలా? ఇదే నిజమైతే మేము వైఎస్సార్సీపీ పాలనను ఎప్పుడూ ఎలా విమర్శిస్తాం? విమర్శించడం ఆపమని మా పార్టీ ఎప్పుడూ చెప్పలేదు. మిత్రధర్మాన్ని పాటిస్తూ ముందుకు సాగుతున్నాం. వైఎస్సార్సీపీ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాడటంతోపాటు పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేసుకుంటున్నాం.
రాష్ట్ర ప్రగతిపై ఎన్డీయేకు స్పష్టత: వైఎస్సార్సీపీ ప్రలోభాలకు ఓటర్లు లొంగరన్న నమ్మకం మాకుంది. వారంతా రాష్ట్ర పాలనను చూసి విసిగిపోయారు. పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్డీయే అధిక స్థానాలు దక్కించుకుంటుంది. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న అంశంపై మాకు స్పష్టత ఉంది. ఓటింగ్ శాతం నమోదుతో సంబంధం లేకుండానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. డిజైన్ లోపం, రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఆగిన పోలవరాన్ని పూర్తిచేసేందుకు సహకరిస్తాం. రాష్ట్రంపై అప్పుల భారాన్ని తగ్గిస్తాం. ఆదాయ మార్గాలను పెంచుతాం.
రాజధానిలేని రాష్ట్రం జగన్‌కే అపకీర్తి: అమరావతి రాజధానిగా ప్రకటించినప్పటికీ కక్షపూరిత ధోరణిలో మూడు రాజధానులని ప్రకటించి ప్రాంతాలవారీగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. రాష్ట్రానికి రాజధాని లేకుండా ఐదేళ్లు పాలించిన ఘనత జగన్‌రెడ్డికే సొంతం. రాజధాని అమరావతి అభివృద్ధికి తొలి నుంచి కేంద్రం కట్టుబడి ఉంది. నిధులనూ మంజూరు చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
భూములను త్యాగం చేసిన రైతుల ఉసురు పోసుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ఎన్డీయే ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగానే సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. అనంతపురం నుంచి అమరావతి వరకు రోడ్డు అనుసంధానం, విజయవాడలో అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మాణానికి నిధులనూ కేటాయించింది. విజయవాడ బెంజి సర్కిల్ వద్ద, భవానీపురం ఫ్లైఓవర్ నిర్మాణాలనూ కేంద్రం చేపట్టింది" అని పురందేశ్వరి వెల్లడించారు.